భద్రాద్రిలో ముగిసిన పునర్వసు దీక్షలు


ఘనంగా పూజలు నిర్వహించి దీక్షల విరమణ

భద్రాచలం,డిసెంబర్‌21( జనం సాక్షి): భద్రాద్రిలో శ్రీరామ పునర్వసు నక్షత్ర పూజలు గనంగా నిర్వహించారు. ఇదే సందర్భంలో పునర్వసు దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీరామ పునర్వసు దీక్షలను శ్రీ రామ దీక్షితులు విరమించారు. 27 రోజులపాటు భక్తిప్రపత్తులతో శ్రీరామ పునర్వసు దీక్షలు పూర్తి చేసుకుని మంగళవారం తెల్లవారు జామున గోదావరి నది స్నానాలు ఆచరించారు. ఈ క్రమంలోనే శ్రీ రామ దీక్షితులు స్వామివారి ఇరుముడులతో ఆలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భద్రాద్రి దేవస్థానం ఈవో బి శివాజీ శ్రీరామ పాదుకలను శిరస్సుపై పెట్టుకుని ఆలయ వైదిక పరిపాలన సిబ్బంది, శ్రీ రామ దీక్షితులు స్వామివారి పాదుకలతో, మేళతాళాలతో రామనామ స్మరణలతో ఆలయ గిరిప్రదక్షిణ గావించారు. అనంతరం భద్రుని కోవెల వద్ద శ్రీ రామ దీక్షితులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇరుముడులు స్వామివారికి సమర్పించి అర్చకుల సమక్షంలో విరమణ చేశారు. రామభక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా శ్రీరామ దీక్షితుల కోసం రాత్రి శ్రీ సీతా రామచంద్ర స్వామి వారికి వెండి రథ సేవ నిర్వహించారు. కాగా శ్రీరామ దీక్షితుల కోసం బుధవారం నాడు పట్టాభిషేకం నిర్వహించనున్నారు.