బిపిన్ రావత్ భారతమాత ముద్దుబిడ్డ..యుద్దతంత్రం తెలిసిన ఓ అల్లూరి సీతారామరాజు..వెన్నువిరవని ఓ కుమ్రం భీమ్..ఆధునిక యుద్ద వ్యూహాలను ఔపోసన పట్టిన అపర సుభాష్ చంద్రబోస్..అన్నింటికి మించి శతృదేశాలకు వణుకు పుట్టించే యుద్దనేర్పరి...సైనికదళాలకు ఆత్మస్థయిర్యం ఇచ్చే మహోన్నత శిఖరం. సైనిక దళాలకు ఆయనొక ఉత్తేజపూరిత హిమవన్నగం. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ..సవాళ్లను అధిగమించే ధృఢచిత్తం..ఆధునిక సాయుధ సంపత్తిని సమకూర్చి భారత సైనిక వ్యవస్థను తీర్చిదిద్దిన మహోన్నత దళపతి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సైనిక హెలికాప్టర్‌లో దుర్మరణం చెంద డానికి సరిగ్గా ఒకరోజు ముందే ఆయన జీవాయుధ యుద్దాల గురించి అప్రమత్తం చేశారు. ఓ రకంగా ప్రస్తుత కరోనా సంక్షోభం ఓ జీవాయుధ యుద్దంగా ఆయన మదిలో రగులుతోంది. చైనా, పాకిస్థాన్ సరిహ ద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. ఆ దేశాలకు వెన్నులో వణుకు పుట్టించింన మంచి బలపరాక్రమ శాలి. ఇలా ఎన్నిరకాలుగా చెప్పుకున్నా రావత్ ముందు దిగదుడుపే. దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించం డలో ఆరితేరిన గండరగండడు. నిజంగా ఆయన మరణం జాతికి విషాదం. ఆయన కుటుంబం అంతా దేశ రక్షణలోనే గడిపింది. చివరకు భార్య మధులిక, మరికొందరు సైనికాధికారులతో కలసి ఆయన దుర్మరణం చెందడం దేశానికి తీరని శోకమే కాదు..తీరని నష్టం కూడా.. ఆయన ఉత్కృష్ట సేవలకు భారతీయులంతా సలాం చేయాలి. అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. మిలిటరీ వ్యూహాల నుంచి ఆపరే షన్ల అమలు వరకు అందెవేసిన చేయిగా మన కళ్లముందు సాక్షాత్కరించిన వ్యక్తి. అపజయం ఎరుగని సైన్యాధికారిగా తన విధులను నిర్వర్తించిన మహోన్నత శిఖరం. మూడు తరాలుగా ఆయనది సైనిక కుటుంబం. ఆయన తండ్రి లక్ష్మణ్‌సింగ్ రావత్ కూడా అంచెలంచెలుగా ఎదిగి లెప్టినెంట్ జనరల్.. ఆర్మీ డిప్యూటీ చీఫ్‌గా పనిచేశారు. 1971 పాకిస్థాన్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. ఆయన చిన్నాన్నలు కూడా సైన్యంలో పనిచేసి రిటైరయ్యారు. ఇలా ఆయన కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే ఆయన ఎంతటి దేశభక్తుడో మనం గమనించవచ్చు. మంచుకొండల్లో అత్యంత ఎత్తయిన శిఖరాల నుంచి జరిగే యుద్దాల్లో ఎంతో అను భవం గడిరచారు. సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పదేళ్లు పనిచేశారు. భారతదేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధూలిక సహా పదమూడుమంది సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఘటన అత్యంత విషాదకరమైనది. మరో పదినిముషాల్లో గమ్యస్థానా నికి చేరుకోబోతుండగా భారతదేశ తొలి సీడీఎస్‌ను మృత్యువు అమాంతం కబళించింది. త్రివిధ దళాలను మరింత బలోపేతం చేయడంతోపాటు వాటిని మరింత ఆధునికీకరించి, వాటిమధ్య సమన్వయం సాధించే లక్ష్యంతో ఒక కొత్త వ్యవస్థ ఆయన నాయకత్వంలో రూపొందుతున్న తరుణంలో ఈ ఘోరం జరిగి పోయింది. ఇది హృదయాన్ని కలచివేసే అనూహ్య దుర్ఘటన. దేశంలో త్రివిధ సైనిక దళాలకు పెద్ద దిక్కుగా సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సైనిక హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం తమిళనాడులో ప్రమాదా నికి గురికావడం, రావత్ ఆయన సతీమణి సహా 13 మంది దుర్మరణం దేశాన్ని కలచివేసే ఘటన. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత, త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం, సైన్యంలో అవసరమైన సంస్క రణల కోసం సీడీఎస్ అనే ప్రత్యేక హోదా ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. రెండు దశాబ్దాల తాత్సారం తర్వాత, రెండేళ్ళ క్రితం అది కార్యరూపం దాల్చింది. ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా రావత్ దూరదృష్టితో, చురుకుగా ముందుకు సాగారు. అప్పటి దాకా ఆలోచనలకే పరిమితమైన సైనిక సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. అనుకున్నది సాధించే దాకా విశ్రమించని వ్యక్తిగా పేరున్న రావత్ విమర్శలు, వివాదాలు వచ్చిపడ్డా వెనక్కి తగ్గనిధీరత్వం ఆయనది. వర్తమానానికి అవసరమైన కీలక సైనిక సంస్కరణలు చేయడా నికి రావత్ సిద్ధమవుతున్న వేళ, దేశానికి పశ్చిమ, ఉత్తరాల నుంచి పాక్, చైనాలతో ముప్పున్న వేళ ఆయన దుర్మరణం మనసైనిక పాటవానికి తీరని లోటు. ఈ భారత వీరపుత్రుడు అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిన సంస్కరణలను ఇప్పుడు మరింత వేగంగా పూర్తి చేయవలసిన ఆగత్యం కూడా ఉంది. భారత రక్షణ రంగం లో అతిపెద్ద సంస్కరణలకు సీడీఎస్‌గా రావత్ మార్గదర్శిగా నిలిచారు. త్రివిధ బలగాల మధ్య సయోధ్యను సాధించడం, వాటిని ఆధునికీకరించడమనే గురుతర బాధ్యతను భుజానకెత్తుకున్న వేళ జరిగిన ఈ దుర్ఘటన ఓ రకంగా సైనిక దళాల ఆత్మస్థయిర్యం దెబ్బతినేలా చేసిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా త్రివిధ దళాలకు ఉన్న పదిహేడు కమాండ్లను ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా తీర్చిదిద్దే పనిలో ఆయన అలు పెరగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకూ మూడు బలగాలూ దేనికదే అధికారాలనూ హోదానూ అనుభవిస్తున్నా యి. ఆయా ప్రాంతాల్లో కీలకభూమిక నిర్వహించే ఒక బలగం కమాండ్‌లో మిగతావి ఉంచే ప్రయత్నం జరుగుతున్నది. దళాల ఆధునికీకరణ, హేతుబద్ధీకరణతో పాటు వనరులనూ, ఆయుధ సంపత్తినీ గరిష్ఠ వినియోగానికి అనుకూలంగా మలచే బృహత్తర బాధ్యతను రావత్ చేపట్టారు. థియేటర్ కమాండ్స్ విషయం లో త్రివిధ దళాల్లోనూ ముఖ్యంగా వైమానికదళంలో తీవ్ర అయిష్టత నెలకొన్నదని అంటారు. అయినప్పటికీ, తన ముసాయిదా నివేదికను త్రివిధబలాధిపతులకూ అందించారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికల్లా దీనిని ఓ కొలిక్కితేవాలన్న సంకల్పంలో ఆయన నిరంతరంగా శ్రిమస్తున్నారు. స్వాతంత్య్రం లభించిన తొలినాళ్ల లోనే సిడిఎస్ ఏర్పాటు ఆలోచన ఉన్నప్పటికీ, త్రివిధదళాల మధ్య విభేదాలకు కారణ మవుతుందన్న భయంతో దానిని గత ప్రభుత్వాలు ఆచరణలో పెట్టలేదు. మోదీ ప్రభుత్వం అందుకు ముందుకు రావడం, దానిని రావత్ ఆచరణలో పెట్టడంతో భారత సైనికపాటవం బాగా రాటుదేలింది. ఆయన వదిలేసి వెళ్లిన ఈ బృహత్ కార్యాన్ని త్వరగా పూర్తిచేసి సైనికదళాల సంపత్తిని మరింత బలోపేతం చేయడం ద్వారా ఆయన కు ఘనంగా నివాళి అర్పించాలి. అప్పుడే ఆయన లక్ష్యానికి అర్థం ఉంటుంది.
రావత్ లక్ష్యసాధనను పూర్తి చేయాలి !