రాష్ట్రపతి శీతాకాల విడిది ఖరారు


29న నగరానికి రానున్న కోవింద్‌

ఏర్పాట్లపై అధికారులతో సవిూక్షించిన సిఎస్‌
హైదరాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన ఈనెల 29న భాగ్యనగరానికి రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కోవింద్‌ బస చేయనున్నారు. వచ్చే నెల మూడో తేదీ వరకు రాష్ట్రపతి హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ప్రతి యేటా రాష్ట్రపతి శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రావడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ఒమిక్రాన్‌ ప్రకంపనల నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటనపై ముందుగా కొంచెం సందిగ్ధం నెలకొంది. అయితే తాజాగా కొవింద్‌ హైదరాబాద్‌ పర్యటన ఖరారైనట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ పర్యటనకు సంబంధించి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి విడిదికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, కంటోన్మెంట్‌ బోర్డు సీఈవోకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి పర్యటన కోసం గత వారం రోజులుగా రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రహదార్లను మరమ్మతులు చేయడంతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా విష సర్పాలను పట్టుకుని జూపార్కుకు తరలిస్తున్నారు.