నవ్వినా, మందు తాగినా కఠిన చర్యలు!


ఉత్తర కొరియా అధ్యక్షుడి తాజా ఆదేశాలు

ప్యాంగ్యాంగ్‌,డిసెంబర్‌17(జనంసాక్షి):  ఆధునిక నియంతగా పేరు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన రూపొందించే చట్టాలు, వేసే శిక్షలు అలా ఉంటాయి మరి. నియంతృత్వ పోకడలతో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఒక విధంగా నార్త్‌ కొరియాలో రాక్షస పాలన సాగిస్తున్నారనే చెప్పాలి. తాజాగా ఆయన తీసుకున్న మరో నిర్ణయం దీనికి తార్కాణంగా చెప్పొచ్చు. 11 రోజుల పాటు దేశ పౌరులెవరూ నవ్వకూడదని, మద్యం తాగకూడదని కిమ్‌ కొత్త రూల్స్‌ పెట్టారు. నార్త్‌ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్‌ జాన్‌ ఇల్‌ చనిపోయి శుక్రవారంతో పదేళ్లు. ఈ సందర్భంగా రాబోయే పదకొండు రోజులు ఆయనకు సంతాపంగా.. దేశ ప్రజలు నవ్వకూడదని కిమ్‌ జాంగ్‌
నిబంధన పెట్టారు. దీంతో పాటు ఆల్కహాల్‌ తాగడం, గృహోపకరణాల కోసం షాపింగ్‌ చేయడం, ఖాళీ సమయంలో సరదాగా గడపడం పైనా నిషేధం విధించారని నార్త్‌ కొరియాలోని సిన్యూజూ సిటీకి చెందిన ఓ వ్యక్తి రేడియో ఫ్రీ ఏషియాతో చెప్పారని సమాచారం. ఈ 11 రోజుల్లో ఎవరైనా రూల్స్‌ ను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. పుట్టిన రోజు వేడుకలతోపాటు ఎలాంటి సెలబ్రేషన్స్‌ చేసుకోవడానికి అనుమతి ఇవ్వరని ఆ వ్యక్తి చెప్పినట్లు తెలిసింది.