అంతర్జాతీయచర్చగా అమరావతి ఉద్యమం


రైతుల పాదయాత్రపై సర్వత్రా ఆసక్తి

మూడు రాజధానుల ధోరణిపై సర్వత్రా అసహనం
అమరావతి,డిసెంబర్‌17(జనంసాక్షి):అనేక నిర్బంధాలు, ఆంక్షలు,లాఠీచార్జీలు, మహిళలని కూడా చూడకుండా క్రూరంగా హింసించడం లాంటి ఘటనలు ఇప్పుడు అమరావతి ఉద్యమాన్ని విశ్వ్యాప్తం చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎపిలో జరుతున్న అమరావతి ఉద్యమంపై ఆసక్తి చూపుతున్నట్లు సోషల్‌ విూడియా స్పందనలను బట్టి చూస్తే తెలుసుకోవచ్చు. ఇంత జరగుతున్నా తాము పట్టిన కుందేటికి మూడు కొమ్ములన్న రీతిలో మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రాజధానుల నుంచి వెనక్కి తగ్గలేదని అంటున్నారు. ఇదంతా మూర్ఖత్వ నిర్ణయం తప్ప మరోటికాదు. నిర్బంధాలన్నింటిని ఎదుర్కొని రాజధానిగా అమరావతి కొనసాగాలనే ఉద్యమం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 2019 డిసెంబర్‌ 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నాటి నుంచి నేటి వరకు అమరావతి రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎంతో హింస, మరెన్నో అవమానాలను రైతులు ఎదుర్కొన్నారు. అయినా వారు మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. అహింసామార్గంలో తమకు, రాష్టాన్రికి జరుగుతున్న అన్యాయాన్ని వారు ప్రపంచం ముందు పెట్టారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా అమరావతికి ప్రతికూల చర్చలు కానీ, ప్రతిఘటన కానీ
ఎదురుకాలేదు. రాష్ట్ర విభజనతో గాయపడి ఉన్న ఆంధప్రదేశ్‌ ప్రజలు అమరావతికి సానుకూలంగా స్పందించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికం గానూ, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థలతోనూ గోదావరి జిల్లాలను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ లతోనూ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రచించారు. అందుకు తగిన విధంగా కార్యాచరణను కూడా ప్రారంభించారు. కేవలం పాలకపక్షం మాత్రమే కాక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు ప్రధాన ప్రతిపక్షంతో సహా ఈ అభివృద్ధి ప్రణాళికను స్వాగతిం చాయి. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని ప్రకటించిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తరవాత పాలకపక్షం మూడు రాజధానుల ప్రకటన అంటూ నిప్పు రాజేసింది. ప్రస్తుత అమరావతిని రియల్‌ మోసంగా
ప్రచారం చేసింది. ఒక సామాజికవర్గం రాజధాని అని రకరకాలుగా దుష్పచ్రారం చేసింది. వీటన్నింటినీ నిరసిస్తూ అమరావతి రైతులు ఉవ్వెత్తున ఉద్యమించారు. ఈ క్రమంలో భూములు ఇచ్చినరైతులు పోరుబాట పట్టారు. ఆ రైతుల నిరసనను అమరావతి గ్రామాల దాటి బయటకు రానీయకుండా ప్రభుత్వం అన్నరకాలుగా అడ్డుకుంది. ఆ నిరసన కేవలం అమరావతి గ్రామాలకే పరిమితమైనదని, పెయిడ్‌ ఆర్టిస్టులు ఉద్యమమని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఉద్యమమని రకరకాల పేర్లతో అక్కడి మహిళలను, రైతులను అవమానించింది. అమరావతి రైతులు మహిళలు ఒకపక్క తమ నిరసనలు తెలియజేస్తూనే మరొకపక్క తమకు న్యాయం చేయాలని న్యాయస్తానాన్ని ఆశ్రయించారు. రాజధాని ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తలంపుతో ’న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు’ పేరుతో ఉద్యమకారులు పాదయాత్ర తలపెట్టారు. నవంబర్‌ 1న, ప్రభుత్వం అనుమతించిన విధంగా 157 మంది అమరావతి ఉద్యమకారులతో పాదయాత్ర ప్రారంభమయింది. వారికి సంఫీుభావంగా ప్రతి రోజూ వేలాది మంది ఆ పాదయాత్రలో భాగస్వాములయ్యారు. అమరావతి పాదయాత్రికులకు అన్ని జిల్లాల, నియోజక వర్గాల, గ్రామాల, పట్టణాల ప్రజలు పూలు, హారతులతో నీరాజనాలు పట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా తమంతట తామే పాదయాత్రికులకు సకల సౌకర్యాలు అమర్చి పెట్టారు. పాదయాత్ర మొదలైన రోజు నుంచి అలిపిరి చేరే వరకూ ప్రజా కళాకారుల ఆటపాటలతో, మధ్యలో వివిధ ప్రాంతాల కళాకారుల కోలాటాలతో పండుగలా సాగింది. అమరావతే ఆంధ్రప్రదేశ్‌ కు ఏకైక రాజధాని అనే ఆకాంక్షను ప్రస్ఫుటంగా చాటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక్కటే రాజధాని ఉండాలన్న సంకల్పాన్ని ప్రకటించారు. దీనికితోడు రాష్ట్రంలోని అన్ని పార్టీలు అన్ని ప్రాంతాల ప్రజలు రాజధాని అమరావతికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారని పాదయాత్ర నిరూపించింది. ఈ క్రమంలో ఇక పునరాలోచన చేయాల్సిన అవసరం గుర్తించాలి. అమరావతిని అభివృద్దిచేస్తే అందువల్ల కలిగే లాభం రాష్టాన్రికే చెందుతుంది. ఒకేరాజధాని ఉంటుందన్న జ్ఞానం పాలకులకు బోధపడాలి. అప్పుడే ఎపికి గౌరవం కూడా ఉంటుంది.