ఒమిక్రాన్‌ విస్తరణతో అలర్ట్‌

 ముంబైలో 144 సెక్షన్‌ విధింపు
ముంబై,డిసెంబర్‌16 (జనం సాక్షి):  కరోనా కొత్త వేరియెంట్‌ ఒమ్రికాన్‌ దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటి వరకు 32 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముంబై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో మరోసారి 144 సెక్షన్‌ విధించింది. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా జనం పెద్దసంఖ్యలో గుమిగూడి వైరస్‌ మరింత వ్యాపించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో ఈ నెల 16 నుంచి 31 వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ముంబై పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు. పోలీసుల అనుమతి లేకుండా జనం సమావేశమవడం, గుంపులుగా తిరగడంపై నిషేధం ఉంటుందని చెప్పారు. ప్రజలంతా కోవిడ్‌ 19 నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు అనుమతితో నిర్వహించే ఈవెంట్లకు హాజరయ్యే అతిథుల సంఖ్య వెయ్యికి పరిమితం చేశారు. నిర్వాహకులతో పాటు ఈవెంట్‌ కు హజరయ్యేవారంతా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నవారై ఉండాలని పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది. ఇక దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ లో పనిచేసే సిబ్బందిరెండు డోసుల టీకా తీసుకున్నవారై ఉండాలని తేల్చి చెప్పింది. ఇతర ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు వచ్చే వారంతా వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేదా ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ రిజల్ట్‌ ను తీసుకురావాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం
చేశారు. ముంబైలో బుధవారం 238 కొత్త కరోనా కేసుల నమోదుకాగా.. ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 7,65,934కు చేరింది.