ధాన్యం కొనుగోళ్లపై అస్పష్టత

 ఇంకా పూర్తిస్థాయిలో సాగని కొనుగోళ్లు

ఆర్బీకెలతో పూర్తిగా న్యాయం జరగగడం లేదన్న ఆరోపణలు
గుంటూరు,డిసెంబర్‌20(జనం సాక్షి): వరి రైతుకు ఈ ఏడాది కాలం కలిసి రాలేదు. తెగుళ్లు, అధిక వర్షాలు, ఎలుకలు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. మరోవైపు మద్దతు ధర లభించే పరిస్థితి కానరావడం లేదు. వర్షం.. తెగుళ్లు.. ఎలుకలు.. ఇలా ధాన్యం రైతును దెబ్బతీశాయి. ఆరుగాలం కష్టించి సాగు చేసినా ఆశించిన దిగుబడులు రాక అన్నదాత అల్లాడుతున్నాడు. సాగు కష్టాలను అధిగమించి పండిరచిన ధాన్యానికి మార్కెట్‌లో మద్దతు గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం మద్దతు ధర సాధారణ రకం క్వింటా రూ.1940, గ్రేడ్‌ ఏ రకం క్వింటా రూ.1960గా ప్రభుత్వం ప్రకటించింది. నరసింగపాడు ఆర్‌బీకేలో ధాన్యం కోనుగోళ్లకు ఏర్పాట్లు చేసినా శాంపిల్స్‌ స్థాయిలోనే ఉన్నాయి. ఆర్‌బీకేల్లో
నిబంధనలు పరిశీలిస్తే ధాన్యం విక్రయించుకునే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. యంత్రాలతో నూర్పిళ్లు చేస్తున్నందున తేమ ఉంటుందన్నారు. అయితే 17 శాతం లోపే తేమ ఉండాలని మార్కెటంగ్‌ శాఖ షరతులు విధిస్తున్నది. దీనికి తోడు ట్రాన్స్‌ఫోర్టు ఖర్చులు, కాటా కూలి కలిపితే బస్తాకు వందకుపైగా ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఆర్‌బీకేలలో షరతులు సడలించాలని, తేమను పరిగణనలోకి తీసుకోకుండా కోనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కూడా మద్దతు ధర అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు ఎకరాకు 5 నుంచి 10 బస్తాల వరకు దిగుబడులు తగ్గాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు మార్కెట్‌లో ధాన్యం ధర పతనమైంది. ఒకవైపు దిగుబడులు తగ్గడం.. మరోవైపు ధర పతనంతో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. ఆర్‌బీకేల ద్వారా రైతుల నుంచి ధాన్యం కోనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందే కాని క్షేత్రస్థాయిలో చర్యలు లేవు. సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు రైతుల నుంచి బస్తా రూ.1100కు కోనుగోలు చేస్తున్నారు. సాగర్‌ ఆయకట్టులో 2.50 లక్షలకు పైగా ఎకరాలలో వరి సాగు జరిగింది. నకరికల్లు మండలం తదతర ప్రాంతాలలో నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండో పంటగా వరి వేసేందుకు రైతులు సిద్ధమవు తున్నారు. ఈ నేపథ్యంలో కోత కోసి కుప్ప వేసే పరిస్థితి లేకపోవడంతో నూర్పిళ్లకు యంత్రాలను ఎక్కువ గా వినియోగిస్తున్నారు. నూర్పిళ్లు జరుగుతున్న ప్రాంతాలలో ఎకరాకు 25 బస్తాలలోపే దిగుబడులు ఉంటున్నాయని రైతులు తెలిపారు. ఏటా 30 నుంచి 40 బస్తాల వరకు దిగుబడులు ఉండేవని ఈ ఏడాది పది బస్తాల వరకు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.30 వేల నుంచి 37 వేల వరకు సాగు వ్యయమైందని.. ఈ పరిస్థితుల్లో అప్పులే మిగిలాయని వాపోయారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే 17 శాతం లోపే తేమ ఉండాలని ప్రభుత్వం షరతు విధిస్తున్నది. ఈ విషయంలో సడలింపులు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఆర్‌బీకేలలో ఇంకా పూర్తి స్థాయిలో కోనుగోలు చేయడంలేదు. ధాన్యం ఆరబెట్టి తీసుకెళ్లడం సాధ్యం కాదని అంటున్నారు.