వంగవీటి రాధాపై రెక్కీ ఆధారాలు లేవు

 అయినా రెండు నెలల సిసి పుటేజ్‌ పరిశీలిస్తున్నాం

విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ వెల్లడి
అయితే రాధా వ్యాఖ్యల వెనక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానం
ప్రస్తుతం బెజవాడలో ఇదే హాట్‌ టాపిక్‌గా మరింత ఉత్కంఠ
విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి):  టీడీపీ నేత వంగవీటి రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహణకు సంబంధించి నిర్దిష్ట ఆధారాలు దొరకలేదని విజయవాడ సీపీ క్రాంతి రాణా అన్నారు. రాధా రెక్కీపై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని తెలిపారు. తమకు రాధా రెక్కీపై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. 2 నెలల సీసీ టీవీ ఫుటేజ్‌ను ప్రస్తుతం పరిశీలిస్తామన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేసి శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా సీపీ క్రాంతి హెచ్చరించారు. తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధా స్వయంగా ప్రకటించారు. దీనిపై మంత్రి కొడాలి నాని సీఎం దృష్టికి తీసుకెళ్లాగా... రాధాకు 2/2 బాడీగార్డ్‌ను కేటాయించారు. కాగా ప్రభుత్వం కేటాయించిన బాడీగార్డ్స్‌ను రాధా తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించా రంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెనుదుమారం రేపాయి. దీంతో రాధా అంశంపై స్పందించిన బెజవాడ సీపీ క్రాంతి రానా మాట్లాడుతూ.. రాధా రెక్కీపై నిర్దిష్ట ఆధారాలు దొరకలేదని ఆయన వెల్లడిరచారు. రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని, మాకు రాధా రెక్కీపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఆయన అన్నారు. అయితే తన తండ్రి వర్ధంతి రోజున సంచలన వ్యాఖ్యలు చేసిన రాధ ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఇంతకీ అది వ్యూహమా? నిజంగా ఆయన చెప్పినట్టు జరిగిందా? తన హత్యకు రెక్కీ నిర్వహిం చారంటూ వంగవీటి రాధాకృష్ణ చేసిన ఆరోపణపై బెజవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తనపని తాను చేసుకుపోయే రాధాను హతమార్చేంత అవసరం ఎవరికి ఉంటుందనేది ఓ ప్రశ్న. రాజకీయం గా ఏదైనా వ్యూహంలో భాగంగా రాధాతో ఎవరైనా ఈ వ్యాఖ్యలు చేయించారా అనేది కూడా ప్రచారంలో ఉంది. బెజవాడలో కులాల కుమ్ములాటలు ఎక్కువ. అప్పట్లో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య వైరం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపించింది. రెండువర్గాల్లోని ప్రధాన నాయకులు కాలం చేశాక.. ఆ రెండు కుటుంబాల మధ్య అసలు వివాదమే లేదు. రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్‌ వైసీపీలో కొనసాగుతున్నారు. ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ వివాదాలు లేవు. మరి.. వంగవీటి రంగా వర్ధంతి రోజున రాధా ఎందుకీ వ్యాఖ్యలు చేశారన్నదే ఇప్పుడు చర్చ. వంగవీటి రాధా హత్యకు నిజంగానే కుట్ర జరిగిందా? అదే నిజమైతే ఎందుకు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? రంగా వర్థంతి రోజునే ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు? తనపై ఎవరు రెక్కీ నిర్వహించారో తెలుసన్న ఆయన.. వారెవరో ఎందుకు వెల్లడిరచడం లేదు. సమయం వచ్చినప్పుడు ఆ విషయం బయటకు వస్తుందని సస్పెన్స్‌ పెంచారు. తనకు భయంలేదని.. ప్రజల్లోనే ఉంటానని.. తన హత్యకు కుట్ర చేసిన వారిని ప్రజలు దూరం పెట్టాలని చెప్పటంతో.. ఆ కుట్ర చేసింది రాజకీయ నాయకులనే చర్చ మొదలైంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా ఏ పార్టీకి చెందిన వారిపై ఈ ఆరోపణలు చేశారో క్లారిటీ రాలేదు.
ఒకవేళ హత్యకు కుట్ర చేశారని.. రాధా చేసిన వ్యాఖ్యలు నిజం కాకపోతే.. ఆయన మాటల వెనక ఉన్నదెవరు? మూడుసార్లు మూడు పార్టీల నుంచి బరిలో దిగి.. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. పైగా సంచలన వ్యాఖ్యలు చేసిన రోజునే టీడీపీ
రెబల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ మాజీ ఎమ్మెల్యేను కలిశారు. వీరిద్దరూ మంత్రి కొడాలి నానితో కలిసి గుడివాడలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. వంశీ, నాని సమక్షంలోనే తన హత్యకు రెక్కీ జరిగిందని సంచలన రేపారు రాధా. రాధాను వైపీపీలోకి తీసుకురావాలని మంత్రి కొడాలి నాని ప్రయత్నించినా అది ఆచరణలోకి రాలేదని టాక్‌. ఇప్పుడు పార్టీ మారేందుకు రాధాతో ఈ వ్యాఖ్యలు ఎవరైనా చేయించారా అనే అనుమానాలు ఉన్నాయని కూడా అంటున్నారు. దీంతో రాధా హత్యకు రెక్కీ వ్యాఖ్యలు నిజమా లేక రాజకీయ వ్యూహమా అనే చర్చ సర్వత్రా ఉంది. ఈ క్రమంలో కమిషనర్‌ క్రాంతి రాణా చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు రెక్కీ నిర్వహించిన దాఖలాలు లేవన్నారు.