రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యం

జిన్నా టవర్‌ పేరుతో చిచ్చు పెడితే ఊరుకోం

హెచ్చరించిన హోంమంత్రి సుచరిత హెచ్చరిక
గుంటూరు,డిసెంబర్‌31 (జనంసాక్షి) : ఎపిలో శాంతిభద్రతలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, దీనికి భిన్నంగా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునేది లేదని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం తప్పన్నారు. రాష్ట్రంలో వివాదాస్పందగా మారిన జిన్నా టవర్‌పై హోంమంత్రి సుచరిత స్పందించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదన్నారు. ఏ ఉద్దేశంతోనైనా ఉన్న కట్టడాలు తొలగించాలనడం సరికాదని తెలిపారు. జిన్నా టవర్‌ వలన జిన్నా ఏం నష్టం చేశాడు, ఏం మేలు చేశాడు అనేది ప్రజలు తెలుసుకుంటారని చెప్పారు. ఎవరు అధికారంలో ఉన్నా ఏన్నో ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన చిహ్నాలను తొలగించాలనడం మంచి పద్దతి కాదని తెలిపారు. అబ్దుల్‌ కలాం పేరుతో కొత్త నిర్మాణాలు చేయండి ఉన్నవి తొలగించవదని చెప్పారు. ఇంకా ఇతర నేతలు చాలామంది ఉన్నారని... వారి విూద ప్రేమ ఉంటే వారి నిర్మాణాలు చేయాలంటూ హోంమత్రి సుచరిత హితవుపలికారు. ఇదే సందర్భంలో ఆమె ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని అభిలషించారు.