మోదీ నిర్ణయాలతో పేదల బతుకులు చిన్నాభిన్నం


` అమేథీ పర్యటనలో తూర్పారాపట్టిన రాహుల్‌
లక్నో,డిసెంబరు 18(జనంసాక్షి):తన సొంత నియోజకవర్గమైన అమేథీ వేదికగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని తూర్పురా బట్టారు. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం అమేథీలో పర్యటించారు. పాదయాత్ర కూడా చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధానాన్ని తప్పుగా అమలు చేయడం, కరోనా క్లిష్ట సమయంలో మొండి చేయి చూపడం? వీటి వల్ల పేద, మధ్య తరగతి ప్రజల జీవనం అతలాకుతలమైందని ఆరోపించారు. వీటివల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తున్నా, ప్రధాని మోదీ మాత్రం దానిపై నోరు విప్పరని, వారణాసిలోని గంగానదిలో మాత్రం మునుగుతారని దెప్పిపొడిచారు. హిందుత్వ వాదుల వల్లే దేశంలో కష్టాలున్నాయని మండిపడ్డారు. హిందువులు, హిందూవాదుల మధ్యే యుద్ధం నడుస్తోందని పునరుద్ఘాటించారు. హిందువులు సత్యాన్ని నమ్ముకుంటే, హిందూవాదులు మాత్రం అధికారాన్నే పరమావధిగా భావిస్తారని బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. చైనా భారత భూభాగాన్ని లాక్కున్నా, ప్రధాని మోదీ మాత్రం కిమ్మనరని, పైగా చైనా తీసుకోలేదని ప్రజలను బుకాయిస్తారని తీవ్రంగా ధ్వజమెత్తారు. నూతన సాగు చట్టాలు ప్రజల మేలు కోసమే అంటూ నమ్మించారని, ఆ తర్వాత ప్రజలను క్షమాపణలు కోరుతున్నారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. అమేథీ ప్రజలు రాజకీయాల విషయంలో తనకు చాలా విషయాలు నేర్పారని, అమేథీ నుంచే మొట్ట మొదటి సారిగా ఎన్నికల గోదాలోకి దిగినట్లు రాహుల్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తన సొంత నియోజకవర్గమైన అమేధీలో అడుగుపెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అమేధీ, వయనాడ్‌ రెండు చోట్ల నుంచీ బరిలోకి దిగారు. అమేధీలో ఘోర ఓటమిని చవి చూశారు. ప్రత్యర్థి, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వయనాడ్‌ నుంచి మాత్రం బంపర్‌ ఓట్లతో విజయం సాధించారు. అప్పటి నుంచి రాహుల్‌ అమేధీ మొహం కూడా చూడలేదు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తాజాగా అమేధీలో పర్యటిస్తున్నారు.