బెల్లి లలితను కించపరిచే సన్నివేశాలు

నయీమ్‌ చిత్రం నిషేధించాలంటూ ఆందోళన

హైదరాబాద్‌,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ జీవిత చరిత్ర ఆధారంగా విడుదలైన నయీమ్‌ డైరీస్‌ సినిమాను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. సినిమాలో తెలంగాణ ఉద్యమకారిని బెల్లి లలితను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సంధ్య థియేటర్‌ వద్ద తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. నయీమ్‌ డైరీస్‌ సినిమా పోస్టర్‌ ప్లెక్సీలను చించివేసి దహనం చేశారు. సినిమాను సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో విడుదల కాకుండా అడ్డుకున్నారు. ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కించపరిచే సినిమాలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్యమకారులు డిమాండ్‌ చేశారు.