కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యమే

  


న్యూఢల్లీి, డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ లేకపోయినా దేశంలో బీజేపీ యేతర ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేయవచ్చని అన్నారు. పదే పదే ట్వీట్లు చేయడం, ఓ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించడం ద్వారా బీజేపీని రాహుల్‌ గాంధీ ఓడిరచలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడైతే కాంగ్రెస్‌ పరిస్థితి మారుతుందని సలహా ఇచ్చారు ప్రశాంత్‌ కిశోర్‌. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.  1984 తర్వాత కాంగ్రెస్‌ ఒంటరిగా గెలిచింది లేదని, గత 10 సంవత్సరాల్లో 90 శాతం కాంగ్రెస్‌ వైఫల్యాన్ని పొందుతూనే వస్తోందని పీకే దెప్పిపొడిచారు. మొట్ట మొదట కాంగ్రెస్‌ తన ఓటమికి బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పీకే సూచించారు. మరోవైపు, కాంగ్రెస్‌ యేతర ప్రతిపక్ష కూటమి విషయంలో మమత వర్సెస్‌ శివసేనగా సాగుతోంది. అసలు యూపీఏ ఎక్కడుంది అంటూ మమతా బెనర్జీ ఎన్సీపీ అధినేత పవార్‌తో భేటీ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో శివసేన స్పందించింది. కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్ష కూటమి సాధ్యమయ్యే విషయం కాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ లేకుండా ఏ ఒక్కరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరన్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ కిశోర్‌ తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.