`
హిందువులకు అధికారమిద్దాం` మోదీ ఆయన స్నేహితులు ఏడేళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారు
` ప్రజలు సమస్యలను పట్టించుకోకుండా అధికారం కోసం పాకులాడుతున్నారు.
` ఎన్డీయే సర్కారుపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు రాహుల్,ప్రియాంక
` తాను హిందువునని..కానీ హిందుత్వ వాదిని కాదన్న రాహుల్
` జైపూర్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
జైపూర్,డిసెంబరు 12(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విమర్శల వర్షం కురిపించారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఏడేళ్ల కాలంలో దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, మల్లికార్జున్ ఖర్గే తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హిందు, హిందుత్వ అంశంపై మరోసారి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, హిందుత్వ వాదిని కాదని పేర్కొన్నారు. భారత్ హిందువుల దేశమని, హిందుత్వవాదులది కాదన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు అల్లాడుతున్నా.. అధికారం కోసం పాకులాడేవారే హిందుత్వ వాదులంటూ భాజపా నేతలనుద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. మోదీ, ఆయన స్నేహితులు ఏడేళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.70 ఏళ్లలో కాంగ్రెస్ సాధించినదాన్ని భాజపా ప్రభుత్వం తన స్నేహితులకు దోచిపెట్టిందని ప్రియాంక విమర్శించారు. ఎన్నికలు వచ్చేసరికి వారికి కులమో, మతమో, చైనానో ఇంకో దేశమో గుర్తొస్తుందని దుయ్యబట్టారు. ప్రజల కష్టాలు మాత్రం వారికి గుర్తుకురావని ఎద్దేవాచేశారు. ‘‘70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. ఆ సంగతి పక్కన పెట్టండి. ముందు విూరు ఈ ఏడేళ్లలో ఏంచేశారో అది చెప్పండి’’ అని ప్రియాంక ఎదురు ప్రశ్నించారు. రైతులుకు ఎరువులు ఇవ్వడంలో విఫలమైన యోగి ఆదిత్యనాథ్ సర్కారు.. ప్రకటనల కోసం మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు.