మళ్లీ పెరిగిన కూరగాయల ధరలు


అందుబాటులో లేని మునగ

కిలో వందకు తక్కువ లేని పలు రకాలు
విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి) : మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇంచుమించుగా అన్ని రకాల ధరలు వందకు కిలో అమ్ముతున్నారు. మునగకాడలు అందుబాటులో లేకుండా పోయాయి. కాయ పదిహేను నుంచి ఇరవై వరకు అమ్ముతున్నారు. నవంబరులో కురిసిన అధిక వర్షాలకు టమోట, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. కోస్తాలో పండిరచే కూరగాయల పంటలు కూడా కొంత దెబ్బతిన్నాయి. పక్క రాష్టాల్లోన్రూ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్‌ మార్కెట్‌లో నెల క్రితం కిలో టమాటా రూ.20లోపు ఉండగా, ఇప్పుడు రూ.60కి ఎగబాకింది. నాణ్యమైన టమాటా కిలో రూ.80దాకా పలుకుతోంది. సంక్రాంతి సీజన్‌లో విరివిగా కాపు కాసే చిక్కుడు కాయలు సెంచరీ కొట్టేశాయి. గణుపు చిక్కుడు రిటైల్‌గా రూ.100దాకా అమ్ముతుండగా, కాస్త మంగున్న కాయలు కిలో రూ.80చెప్తున్నారు. ఏ రకమైనా కిలో రూ.40కు తక్కువేవిూ లేవు. అన్నీ రూ.50పైనే పలుకుతున్నాయి. క్యారెట్‌, బీట్రూట్‌, కాకర వంటివి కిలో రూ.80 ఉంటే, క్యాప్సికం, గణుపు చిక్కుడు ఏకంగా రూ.100దాకా అమ్ముతున్నారు. దీంతో కిలో కూరగాయలు కొనే వారు కూడా అరకిలో, పావుకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. ధరల పెరుగుదలతో పెట్టుబడులు పెరిగి, ఎక్కువ ధరకు అమ్ముడుపోక.. బేరాల్లేవని కొంత మంది రిటైల్‌ వ్యాపారులు కూరగాయల అమ్మకాలే నిలిపివేస్తున్నారు. తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. బహిరంగ మార్కెట్లలో కూరగాయలు ధరలు రెట్టింపు కావడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. రైతుబజార్లలో ధరలు కాస్త తక్కువగా ఉంటున్నాయి. పైగా రైతుబజార్లు పట్టణాలకే పరిమితం కాగా, గ్రావిూణ ప్రాంతాల్లో రిటైల్‌ మార్కెట్లలో కూరగాయలు ధరలు మరీ ఎక్కువగా చెప్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. ఆకుకూరల ధరలు కూడా ప్రియంగానే ఉన్నాయి. క్యారెట్‌ కిలో రూ.80, బీట్రూట్‌ రూ.70, క్యాప్సికం రూ.90, బంగాళాదుంపలు కిలో రూ.40దాకా పలుకుతున్నాయి.