` హెలికాప్టర్ ప్రమాదంలో భార్య మధులికతో సహా మృత్యువాత
` నేడు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్
` ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌లతో సహా పలువురు ప్రముఖుల సంతాపం
చెన్నై,డిసెంబరు 8(జనంసాక్షి):దేశంలో జాతీయ విషాదం నెలకొంది. తొలి రక్షణదళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ మృతి దేశాన్ని విషాదంలోకి నెట్టింది. అత్యంత అధునాతన ఆర్టీ హెలకాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆయన మృత్యువుతో పోరాడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందినట్లు వాయుసేన ధృవీకరించింది. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ విల్లింగ్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నది. బిపిన్ రావత్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు సంతాపం ప్రకటించారు. బుధవారం ఉదయం ఢల్లీి నుంచి డిఫెన్స్ విమానంలో కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్‌బేస్‌కు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా 9 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. సూలూరు ఎయిర్‌బేస్ నుంచి కూనూరు కంటోన్మెంట్‌కు ఆర్మీ హెలికాప్టర్‌లో బిపిన్ రావత్ దంపతులతో పాటు 12 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. ఇక కూనూరు ఎయిర్‌బేస్‌లో మరో 5 నిమిషాల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే కంటే ముందే చాపర్ కుప్పకూలిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా మధ్యాహ్నం 1:50కి ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలిపింది. బుధవారం సాయంత్రం 6:03 గంటలకు బిపిన్ రావత్ మృతిని వాయుసేన అధికారికంగా ధృవీకరించి ట్వీట్ చేసింది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కూనూరు కంటోన్మెంట్‌కు ఎందుకు వెళ్లారంటే.. అక్కడున్న ఆర్మీ రీసెర్చ్ కేంద్రంలో ప్రసంగించాల్సి ఉండటంతో వెళ్లారు. ఈ కేంద్రంలో దక్షిణాది రాష్టాల్రకు సంబంధించి ఆర్మీ శిక్షణ కొనసాగుతోంది. ఆ కంటోన్మెంట్ ఏరియాకు చేరుకునే క్రమంలోనే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలి పోయింది. అయితే ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ప్రమాదమా? విద్రోహమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రావత్ కుటుంబం అంతా ఆర్మీలోనే
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సిడిఎస్ బిపిన్ రావత్ కుటుంబం అంతా దేశం కోసం ఆర్మీలో పనిచేసిన వారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రావత్ దేశం సైనికంగా బలపడేం దుకు అహర్నిశలు పనిచేవారు. ఆధునిక యుద్దవ్యూహాల్లో ఆయన దిట్ట. భారత ఆర్మీని అధునాతన యుద్దరీతులకు తర్ఫీదు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే. భారత్ రక్షణరంగంలో అతిపెద్ద సంస్కరణలకు జనరల్ రావత్ మార్గదర్శి. వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే గురుతర బాధ్యత ఆయన చేపడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీలో రాజ్‌పుత్ కుటుంబంలో జనరల్ బిపిన్ రావత్ జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ భారత సైన్యంలో లెప్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. సైనిక కుటుంబంలో పుట్టిన జనరల్ రావత్.. 1978 డిసెంబర్ 16న ఇండియన్ ఆర్మీలో చేరారు. 11 గోర్ఖా రైఫిల్స్ 5వ బెటాలియన్‌లో సేవలందించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. సైన్యంలో ఫోర్‌స్టార్ జనరల్ స్థాయికి చేరుకున్నారు. 2020 జనవరి 1న భారత్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణెళి కంటే ముందు బిపిన్ రావత్ సైన్యాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 డిసెంబర్ 31 నుంచి 2019 డిసెంబర్ 31 వరకూ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.దేశంలో మొదటిసారిగా చీఫ్ ఆఫ్ డిఫేన్స్(సీడీఎస్) పదవిలో జనరల్ బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ 30 డిసెంబర్ 2019లో నియమితులయ్యారు. సీడీఎస్ పదవి కంటే ముందు ఆయన చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 57వ ఛైర్మన్‌గా పనిచేశారు. సెప్టెంబర్ 29నాటి సర్జికల్ స్టైక్స్ వ్యూహకర్తల్లో రావత్ ఒకరు. ఆర్మీ డిప్యూటీ చీఫ్ హోదాలో నాటి దాడుల ఆపరేషన్‌ను స్వయంగా పరిశీలించారు. 1978లో గూర్ఖా రైఫిల్స్‌లో చేరిన రావత్ 2016 డిసెంబర్ 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి, మూడేళ్ల పూర్తి కాలం కొనసాగారు. ఆర్మీ చీఫ్ కాకమునుపు జనరల్ రావత్ ఈశాన్య రాష్టాల్రతోపాటు పాక్, చైనా సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో 16 మార్చ్,1958లో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ లెప్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగారు. రావత్‌కు భార్య మధులిక, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. రావత్ డెహ్రాడూన్‌లోని కేంబ్రియన్ హాల్ స్కూల్‌లో, సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్‌లో విద్యను అభ్యసించారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడవిూ, ఖడక్వాస్లా, ఇండియన్ మిలిటరీ అకాడవిూ, డెహ్రాడూన్‌లో చేరారు. రావత్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, వెల్లింగ్‌టన్, యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్, కాన్సాస్‌లోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లోని జనరల్ స్టాఫ్ కాలేజీలో ఉన్నత కమాండ్ కోర్సులో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 2011లో విూరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ ఆయనకు సైనిక`విూడియా వ్యూహాత్మక అధ్యయనాలపై చేసిన పరిశోధనలకు డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీని ప్రదానం చేసింది. రక్షణశాఖలో రావత్ అదించిన సేవలకు గాను.. భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం అతి విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం, సేవా పతకం, విశిష్ట సేవా పతకాలను పొందారు.
జనరల్ బిపిన్ రావత్ అద్భుత సైనికుడు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం
తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బిపిన్ రావత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘’జనరల్ బిపిన్ రావత్ అద్భుత సైనికుడు. నిజమైన దేశభక్తుడు. ఆయన మన సాయుధ బలగాలను, భద్రతా యంత్రాంగ ఆధునీకీకరణలో దోహదపడ్డారు. వ్యూహాత్మక విషయాలపై ఆయన ఆలోచనలు అసాధారణం. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఓం శాంతి’ . అని ట్వీట్ చేశారు.
ధైర్యవంతుడైన సైనికుడిని దేశం కోల్పోయింది
రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ సంతాపం
సైనిక హెలికాప్టర్ ఘటన తనను తీవ్రంగా బాధించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన సతీమణి మధులిక మరణం తనను షాక్‌కి గురిచేసిందన్నారు. ఓ ధైర్యవంతుడైన సైనికుడ్ని దేశం కోల్పోయిందని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల పాటు మాతృభూమికి నిస్వార్థంగా సేవలందించిన బిపిన్ రావత్ తన శౌర్యంతో, వీరత్వంతో గుర్తింపు పొందారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు
రావత్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రావత్‌తో పాటు ఆయన సతీమణి మధులిక, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మృతిపట్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందడం తనను తీవ్ర దిగ్భార్రతికి గురి చేసిందని కవిత ట్వీట్ చేశారు. ఈ నష్టాన్ని భరించే శక్తిని, మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు ఆమె పేర్కొన్నారు. మాతృభూమి రత్నాలను కోల్పోయిన మనందరికీ ఇవాళ చాలా బాధాకరమైన రోజు అని కవిత ఆవేదనకు లోనయ్యారు.