పార్టీకి నష్టం తప్పదని తెలిసినా ముందడుగే
మోడీ నిర్ణయంతో సైలెంట్ అయిన బిజెపి నేతలు
ఉమ్మడిగా ఉద్యమిస్తే తప్ప ఉక్కును కాపాడలేరు
విశాఖపట్టణం,డిసెంబర్10(జనంసాక్షి): నాటి ఇందిరాగాంధీని దిగివచ్చేలా చేసి ఉక్కు ఫ్యాక్టరీని సాధింన ఆంధ్రులు ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మోడీలాంటి మొండి నాయకుడిని కదిలించగలిగే స్థాయిలో ఉద్యమం సాగడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు,నేతల బలహీనతలను గమనించిన కేంద్రపెద్దలు విశాఖ ఉక్కు విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రజల్లో కనీసం చైతన్యం లేకపోవడాన్ని గమనించిన కేంద్రపెద్దలు ఇప్పుడు విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను ఇప్పుడు అమ్ముకుంటూ పోవాలన్న సంకల్పం నుంచి వెనక్కిరావడం లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేముందు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా లేదు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఆంధప్రదేశ్ ప్రజలు ఏ స్థాయిలో ఉద్యమిస్తారో తెలియదు. అయినప్పటికీ విశాఖ ఉక్కుపరిరక్షణ సమితి 300 రోజులుగా ఆందోళన కొనసాగిª`తోంది. రాజకీయపార్టీలు కూడా ఆందోళనలకు మద్దతుగా నిలిచారు. ప్రజల్లో స్పందన లేనంత మాత్రాన అమ్మకానికి మద్దతు లభించిందని అనుకుంటున్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి సొంతంగా ఇనుపఖనిజం గనులు లేకపోవడం వల్లనే నష్టాలు వస్తున్నాయన్నది ప్రధానమైన వాదన! అదే నిజమైతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత వారు మాత్రం సొంత గనులు కావాలని పట్టుబడతారు. గనులు కేటాయిస్తేనే కొంటాం అని చెబుతారు కూడా. అయినా ఫ్యాక్టరీ కొనుగోలుకు మళ్లీ ప్రభుత్వరంగ బ్యాంకులే అప్పులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రజల డబ్బుతో అదానీ లేదా అంబానీ లేదా మరొకరు దీనిపై పెత్తనం చేస్తారు. లాభాలు వస్తాయన్న నమ్మకం కలగనిదే వారు మాత్రం ఎందుకు ముందుకొస్తారన్నదదే ఇక్కడ ప్రశ్న. అంటే ఉక్కు ఫ్యాక్టరీతో లాభాలు ఉంటాయని వారు గుర్తించే ఉంటారు. లాభాల కోసం ఉత్పత్తి సామర్థ్యం తగ్గిస్తారు. పుష్కలంగా అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూమిలో కొంతభాగాన్ని వాణిజ్య అవసరాలకు విక్రయించుకుంటూ పోయే అవకాశముంది. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే ముందుగా జరిగేది ఇదే! ఓ రకంగా ప్రజలు ఉదారంగా ఇచ్చిన భూములను తమ అనుయాయులకు కట్టబెట్టే యత్నం తప్ప మరోటి కాదు. ఆంధ్రులలో చైతన్యం రానంతవరకు విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకతప్పదు. ఆంధ్రులు ఇప్పటికైనా మేల్కోని ఉద్యమించకుంటే ఉక్కు ఫ్యాక్టరీ హుష్కాకి కాక తప్పదు. ఇక విశాఖ ఉక్కును విక్రయించాలన్న కేందప్రభుత్వ నిర్ణయం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా పడుతుందని భావించినా బిజెపి పట్టించుకోవడం లేదు. ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడికీ పోదన్న సంకేతాలు ఇస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల స్థానికంగా బీజేపీ ఆత్మరక్షణలో పడిరదనేచెప్పాలి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న నిర్ణయం విషయంలో కేందప్రభుత్వం అడుగులు ముందుకే పడుతున్నాయి. ఈ విషయంలో బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు లాంటి వారు కూడా గట్టిగా విూచేయలేని పరిస్థితి. ఈ నిర్ణయం ప్రభావం మున్ముందు బీజేపీ` జనసేన సంబంధాలపై కూడా పడే అవకాశముంది. బీజేపీతో కలిసి నడిస్తే మునిగిపోతామని తెలుసుకున్న మరుక్షణం జనసేన తమ మిత్రబంధాన్ని తెంపేసుకోవచ్చు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రపెద్దల మనసు మార్చవలసిన బాధ్యత ఇప్పుడు ప్రధానంగా బీజేపీ`జనసేన కూటమిపై ఉంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ బాధ్యత నుంచి ఆ రెండు పార్టీలు తప్పించుకోలేవు. విశాఖ ఉక్కు వ్యవహారంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇరకాటంలో పడిరదని చెప్పవచ్చు. అధికారంలో ఉన్నందున కేంద్రాన్ని నిలువరించే బాధ్యత నుంచి ఆ పార్టీ కూడా తప్పుకోజాలదు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు సెంటిమెంటు మరింతగా బలపడితే వైసీపీ ఇరకాటంలో పడిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం మెడలు వంచాల్సిన నైతిక బాధ్యత జగన్రెడ్డిపైనే ఉంటుంది. ఇందుకోసం ఆయన కేంద్రపెద్దలతో ప్రత్యక్ష పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో ఆయన ఏ వైఖరి తీసుకుంటారు? కేంద్ర నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా? లేక పోలవరం తరహాలో రాజీ పడిపోతారా? అన్నది ప్రశ్నగా ఉంది. కార్యనిర్వాహక రాజధానిని నిజంగానే విశాఖలో ఏర్పాటుచేసినా దానివల్ల కలిగే ప్రయోజనం కంటే విశాఖ ఉక్కు విషయంలో నిర్లిప్తత ప్రదర్శిస్తే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, విశాఖ ఉక్కు విక్రయం అంశం ఆ పార్టీకి లభించిన ప్రధాన అస్త్రంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్రెడ్డి బాటలోనే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా కేంద్రపెద్దలకు భయపడి విశాఖ ఉక్కు విషయంలో మెతక వైఖరి అవలంబిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు.