దిశచట్టం మరింత పటిష్టంగా ఉండాలి

 కఠినంగా శిక్షలు వేస్తే తప్ప మార్పు రాదు

అమరావతి,డిసెంబర్‌14  (జనం సాక్షి)  :   ఎపి సర్కార్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుని దిశ చట్టాన్ని తీసుకుని వచ్చినా లైంగిక వేదింపులు, ప్రేమదాడులు ఆగడం లేదు. అలాగే వరుస ఘటనలు ఎపిలో ఆందోళన కలిగిస్తున్నాయి. మృగాళ్ల కారణంగా ఆడపిల్లలకు భయం కలుగుతోంది. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు మరింత క్షోభకు గురవుతున్నారు. దిశ లాంటి ఓ పటిష్ట చట్టం తీసుకుని రావడం నిజంగా అభినందనీయం అనుకున్న వారు కూడా ఇప్పుడు భయపడేలా పరిస్థితులు దాపురించాయి. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు కఠిన శిక్షలు పడేలా చూడాలని సత్వర శిక్షలు అమలు చేయాలని యావత్‌ దేశం కోరుకుంటున్న వేళ ఎపి సిర్కార్‌ దిశ చట్టాన్ని గతేడాది తీసుకుని వచ్చింది. మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా దిశ చట్టాన్ని రూపొందించారు. దీనిని నిర్దారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడితే అతి త్వరగా నిందితులకు మరణశిక్ష పడేలా చట్టం తీసుకొచ్చింది. ఇటువంటి కేసుల్లో నిందితులను దోషులుగా నిర్థారించే ఆధారాలున్నప్పుడు మూడు వారాల్లోగా అంటే 21 వర్కింగ్‌ డేస్‌ ల్లో తీర్పు వచ్చేలా క్రిమినల్‌ లా చట్టంలో మార్పులు చేసారు. కానీ ఇటీవలి ఘటనలు మృగాళ్లలో భయాన్ని కలిగించడం లేదని తెలిస్తోంది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరకారించందనో లేక తనను ప్రేమించడం లేదనో లేకపోతే..ఒంటరి అమ్మాయిలను లేదా మహిళలను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నారు. రేప్‌లు చేయడం, హత్యలు చేయడం చాలా సులువైన పనిగా చూస్తున్నారు. దిశలో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలోను ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక ఘటనల్లో నేరాల విచారణకు ప్రతి జిల్లాల్లోను ప్రత్యే కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాదు సోషల్‌ విూడియా వేధికగా బాధిత మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలకు అడ్డుకట్టవేసేలా చట్టాన్ని రూపొందించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగ్‌లు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపనున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆడవాళ్లపై అకృత్యాలు జరిగిన వెంటనే ఉపశమనం కలిగే చట్టం రావాలని తల్లిదండ్రులు, ప్రతి మహిళ, చెల్లి, ప్రతి ఇంట్లోని ఆడపిల్ల ఎదురు చూస్తోంది. ఎపి ప్రభుత్వం కఠిన చట్టంతో మహిళలకు భరోసా ఇస్తోంది. అయితే
చట్టాలు ఉన్నా ప్రజల్లో మార్పులు మాత్రం రావడం లేదు. దుండగులను కఠినంగా అణచివేస్తే తప్ప మహిళలకు రక్షణ ఉండదని తేలిపోయింది. కఠినంగా అణచివేత చర్యలకు ఉపక్రమించాలన్ని సర్వత్రా విజ్ఞప్తులు వస్తున్నాయి. భయం కలిగేలా పోలీసులు వ్యవహరించాలని కూడా యువతులు కోరుకుంటున్నారు.