ఐటి అధికారుల పేరుతో భారీ దోపిడీ

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఘరానా లూటీ

హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఐటీ అధికారులమంటూ భారీ దోపిడీకి పాల్పడ్డారు. సోదాల పేరుతో జయభేరి ఆరెంజ్‌ కౌంటిలోకి ఐదుగురు దుండగులు ప్రవేశించారు. సీ బ్లాక్‌లోని 110వ ప్లాట్‌లో ఉండే భువన తేజ్‌ ఇన్‌ ఫ్రా కంపేని యాజమాని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సుబ్రమణ్యం, భాగ్యలక్ష్మి దంపతుల నివాసంలోకి చొరబడ్డ దుండగులు.. తనిఖీల పేరుతో నానా హంగామా సృష్టించారు. బంగారం, నగదు తీసుకొని దుండగులు పరారీ అయ్యారు. దీంతో బాధిత దంపతులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో ఉన్న134 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదు అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదంతా తెలిసిన వారు చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.