నేడు తిరుపతిలో అమరావతి రైతుల సభ

 భారీగా ఏర్పాట్లు చేసిన రైతు సంఘాల నేతలు

పూజలు చేసి పనులు ప్రారంభించిన రైతులు
సభకు అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం
చంద్రబాబు సహా పలు పార్టీల నేతలు రాక
అది రైతు సభ కాదు..రాజకీయ సభ అన్న బొత్స
అమరావతి,డిసెంబర్‌16 (జనం సాక్షి): అమరావతి ఏకైక రాజధాని కోసం అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన పాదయాత్ర ముగియగా..శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి సవిూపంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో గురువారం దాదాపు 20 ఎకరాల ప్రైవేట్‌ స్థలంలో ఏర్పాట్ల పనులకు జేఏసీ నాయకులు పూజలు చేసి చేశారు. కోర్టు ఆదేశాలకు లోబడి కార్యక్రమాలు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. ఈ సభకు అన్ని ప్రధాన పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు, ప్రజాసంఘాలకూ ఆహ్వానం పంపారు. విభాగాల వారీగా ప్రత్యేక గ్యాలరీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, సభకు వచ్చే వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. తెదేపా, కాంగ్రెస్‌, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం వంటి అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు, ప్రజా, రైతు, వర్తక, వాణిజ్య సంఘాలను ఆహ్వానించామని నిర్వాహకులు వెల్లడిరచారు. పాదయాత్రతో మరోసారి ఉద్యమం ఊపందు కుంది. అమరావతి రాజధాని నినాదం గర్జిస్తోంది. అమరావతినే రాజధాని కొనసాగించాలంటూ న్యాయ స్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించిన రైతులు తిరుచానూరులో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలుచేయాలంటూ సీమ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రాయలసీమ విద్యార్థి సంఘాలు కర్నూలులో సమావేశం ఏర్పాటు చేశాయి. మరోవైపు అసలు రాజధానిపై రాజకీయ పార్టీల స్టాండ్‌ ఏంటి? అంటూ రాయలసీమ చైతన్య సభకు ఏర్పాట్లు చేస్తోంది రాయలసీమ మేధావుల ఫోరం. సింగిల్‌ కేపిటల్‌ వర్సెస్‌ 3 రాజధానులు వికేంద్రీకరణపై పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కాబోతున్నారు. చంద్రబాబు వెంట అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌ బాబు, తెనాలి శ్రవణ్‌ కుమార్‌తోపాటు మరికొందరు నేతలు హాజరవుతున్నారు. తిరుపతిలో నిర్వహించనున్న రాయలసీమ చైతన్య సభకు రాయలసీమ మేధావుల ఫోరం సన్నాహక ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ సభను విజయవంతం చేయాలంటూ భారీ ప్రదర్శన చేపట్టారు. ఒకవైపు అమరావతి రాజధాని కోసం రైతుల బహిరంగ సభ, మరోవైపు రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, జరగాల్సిన అభివృద్ధిపై చైతన్య సభ. ఇవన్నీ పోలీసులకు చాలెంజింగ్‌గా మారాయి. అయితే శుక్రవారం తిరుపతిలో జరిగేది రైతుల సభ కాదు.. రాజకీయ సభ అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. తిరుపతి సభలో వైసీపీ అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేస్తోందన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్‌ ఇచ్చారు. విజయవాడ నుంచి తిరుపతి వరకు జరిగిన పాదయాత్రలో టీడీపీ వాళ్ళు మినహా ఎవరైనా స్వచ్చందంగా వచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అజెండా ప్రకారం ఆ 29 గ్రామాలు వారి సమాజికవర్గాన్ని అభివృద్ధి చేయడమే అని అన్నారు.రాజధాని రైతులది మాత్రమే త్యాగం అని చంద్రబాబు అంటున్నారు.. మరీ నాగార్జున సాగర్‌, పోలవరం కట్టడానికి వేల మంది రైతులు భూములు ఇచ్చారు.. వారిది త్యాగం కాదా? అని ప్రశ్నించారు. తాము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదని.. చంద్రబాబుకి ఒక అజెండా అని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌ వద్దని అచ్చం నాయుడుకి ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడం.. జాతి సంపాదని దోచుకుంటు త్యాగం అంటున్నారని.. అదే అమరావతిలో అవినీతి జరిగిందని ప్రధాని మోడీ అన్నారు. రాజకీయ ఉద్దేశాలతో బీజేపీ వాళ్ళు స్టాండ్‌ మార్చుకున్నారు. ఇక జనసేన పగలు ఎవరితో ఉంటుందో రాత్రి ఎవరితో ఉంటుందో తెలిసిందే కదా మంత్రి బొత్స ఎద్దేవ చేశారు.