వైభవంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

ఆదిలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన పూద్మావతి

తిరుపతి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై అమ్మవారు ఆదిలక్ష్మిదేవి అలంకారంలో శంఖుచక్రాలతో భక్తులకు అభయమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. ముద్దులొలికించే ముత్యాలు అలిమేలు మంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలు మంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది.