చివరి దశకు చేరుకుంటున్న పత్తి అమ్మకాలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):  ఎప్పటిలాగే పత్తి అమ్మకాలు చివర దశకు చేరుకోవడంతో ధరలు మెల్లగా పెరుగుతున్నారు. మద్దతు ధర కంటే మార్కెట్‌లో పత్తికి ఎక్కువ ధర ఉండటంతో సీసీఐకి రైతులు పత్తిని అమ్మడం లేదు.అంతర్జాతీయ మార్కెట్‌లో జరిగిన మార్పుల కారణంగా విపణిలో పత్తికి మెల్లగా డిమాండ్‌ పెరగడం, మరో వైపు బేళ్లు, గింజలు తదితర వాటి ధర పెరగడం వల్ల పతి ధర పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. గతేడాది ఇలాగే డిమాండ్‌ పెరిగిపోవడంతో పోటీ పడి కొనుగోలు చేసారు. ఇక్కడ ఎక్కువ పెరుగుదల ఉండకుండా వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పత్తి ధర పెరగడం పట్ల రైతుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నా.. ఇప్పటికే అనేక మంది తమ దగ్గర ఉన్న పత్తిని అమ్మేశారు. మార్కెట్‌కు ఉత్పత్తి రాక తగ్గడంతో జిల్లాలోని మార్కెట్‌ యార్డులలో పత్తి ధర పెరుగుతోంది. తేమ ఎక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలో తేమ శాతం 8కి మించి ఉంటే కిలో చొప్పున కోత విధించారు. నిల్వలు ఉన్న రైతులు పత్తిని అమ్మేందుకు ఎక్కువ మొత్తంలో తీసుకొస్తున్నారు.