ఎవరికి అవకాశం దక్కుతుంది?

 









మరెవరికి ఉద్వాసన పలుకుతారో?
తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి
సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌తో టీమిండియా తొలిటెస్ట్‌
26 నుంచి సెంచూరియన్‌ వేదికగా బాక్సింగ్‌ డే టెస్ట్‌
సెంచూరియన్‌,డిసెంబర్‌21(జనం సాక్షి): సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు టైమ్‌ దగ్గరపడుతున్న వేళ.. టీమిండియా ఫైనల్‌ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బౌన్సీ కండీషన్స్‌ దృష్టిలో పెట్టుకుని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఐదుగురు బౌలర్ల స్ట్రాటజీకి వెళ్తాడా? ఈ క్రమంలో ఆల్‌రౌండర్‌ వైపు మొగ్గు చూపుతాడా? లేక ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను ఆడిస్తాడా? అలాగే హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ విహారిని.. బాక్సింగ్‌ డే టెస్ట్‌కు కన్సిడర్‌ చేస్తాడా? ఈ నెల 26 నుంచి సెంచూరియన్‌ వేదికగా జరిగే బాక్సింగ్‌ డే టెస్ట్‌ వరకు ఈ అంశాలపై క్లారిటీ రావాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ప్రస్తుతం టీమిండియా సూపర్‌ స్పోర్ట్స్‌ పార్క్‌లోని సెంటర్‌ వికెట్‌పై ప్రాక్టీస్‌ చేస్తోంది. ఈ ప్రాక్టీస్‌ను ఆధారంగా చేసుకుని ఫైనల్‌ ఎలెవన్‌ను ఎంచుకోవాలని విరాట్‌ అండ్‌ కో ప్లాన్‌ చేస్తోంది. వన్డే కెప్టెన్సీ మార్పుతో భారత క్రికెట్‌లో రాజుకున్న అగ్గి అనంతరం జరుగుతున్న ఫస్ట్‌ మ్యాచ్‌ కావడంతో టీమిండియా ఫైనల్‌ కాంబినేషన్‌ ఎలా ఉంటుందనే ఆతృత అందరిలో ఉంది. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌ అనంతరం బ్రేక్‌ తీసుకున్న ఆటగాళ్లంతా ఈ సిరీస్‌తోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు. దాంతో ఎవరికి అవకాశం దక్కుతుంది? మరెవరికి ఉద్వాసన పలుకుతారో చెప్పడం కష్టంగా మారింది. 18 మంది ఆటగాళ్ల నుంచి తుది జట్టును ఎంపిక చేయడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది. యువ ఆటగాళ్లు సత్తా చాటుతుండటం.. మరోవైపు సీనియర్‌ ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతుండటంతో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది టీమ్‌మేనేజ్‌మెంట్‌ తేల్చుకోలేకపోతుంది. గత పర్యటనల అనుభవం దృష్ట్యా సీనియర్లకు అవకాశం ఇవ్వాలా? లేక ఇటీవల సత్తా చాటి మంచి ఫామ్‌లో యువ ఆటగాళ్లను ఆడిరచాలా? అనేది హెడెక్‌గా మారింది. ఇక రోహిత్‌ శర్మ స్థానంలో న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సెంచరీతో మెరిసిన మయాంక్‌ అగర్వాల్‌ ఆడటం ఖాయమైంది. కేఎల్‌ రాహుల్‌తో కలిసి మయాంక్‌ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నాడు. గాయాలై తప్పుకుంటే తప్పా ఈ ఓపెనింగ్‌ కాంబినేషన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. గత కొంత కాలంగా దారుణంగా విఫలమవుతున్న చతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానేలకు ఈ సిరీస్‌ లాస్ట్‌ చాన్స్‌ అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా అదే వైఫల్యం కొనసాగితే వారి కెరీర్‌లు దాదాపు ముగిసినట్లే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెనకెసుకొచ్చిన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వినే పరిస్థితిలో లేడు. పైగా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఫస్ట్‌ టెస్ట్‌లో రహానే, పుజారాల్లో ఒకరికే అవకాశం దక్కనుంది. పుజారా ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ చేస్తే నాలుగో స్థానంలో కోహ్లీ రానున్నాడు. ఆ తర్వాత రిషభ్‌ పంత్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. అనుభవానికి ఓటేస్తే రహానేకు అవకాశం దక్కుతుంది. లేదంటే అయ్యరే తుది జట్టులో ఆడనున్నాడు. అయ్యర్‌కు అవకాశం వస్తే అతను ఐదో ప్లేస్‌లో పంత్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నారు. సౌతాఫ్రికా పిచ్‌లు పూర్తిగా పేస్‌కు అనుకూలం కాబట్టి భారత్‌ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌ పర్యటనలోనూ కోహ్లీసేన ఇదే ఫార్మూలాను ఉపయోగించింది. అదే జరిగితే ఏకైక స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బరిలోకి దిగుతాడు. జట్టులో జడేజా కూడా లేడు కాబట్టి అశ్విన్‌కు పోటీ లేదు. నలుగురు పేసర్లుగా జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, శార్దూల్‌ ఠాకూర్‌, మహమ్మద్‌ సిరాజ్‌ బరిలోకి దిగుతారు. బుమ్రా, సిరాజ్‌ తర్వాత బ్యాటింగ్‌ సామర్థ్యం కలిగిన శార్దూల్‌ ఠాకూర్‌కే ప్రాధాన్యత దక్కనుంది. అయితే ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్‌ను ఆడిరచాలనుకుంటే మాత్రం మమహ్మద్‌ షమీపై వేటు పడే అవకాశం ఉంది. అప్పుడు హనుమ విహారి లేదా రహానే బరిలోకి దిగుతారు. స్పిన్నర్‌ వద్దనుకొని నలుగురు పేసర్లు, ఓ ఎక్స్‌ ట్రా బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం అశ్విన్‌కు నిరాశ తప్పదు.