తబ్లిగీ జమాత్‌పై సౌదీలో నిషేధం

  


రియాద్‌,డిసెంబరు 12(జనంసాక్షి):సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇస్లామిక్‌ దేశాలు ఆశ్చర్య పోయే రీతిలో తబ్లిగీ జమాత్‌ సంస్థను నిషేధించింది. ఈ సంస్థ ఉగ్రవాదానికి పునాదులేస్తున్నదని అభివర్ణించింది. అంతే కాదు వచ్చే శుక్రవారం ప్రార్థనలు ప్రారంభమయ్యే లోపు తబ్లిగీ సభ్యులు మసీదులను ఖాళీ చేయాలని సౌదీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసిందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది. ఇక నుంచి శుక్రవారం ప్రార్థనల వేళ తబ్లిగీ జమాత్‌ సభ్యులను ప్రజలు కలుసుకోవాల్సిన అవసరం లేదని సౌదీ సర్కార్‌ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.వారితో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకోవాల్సిన అవసరమే లేదని పేర్కొన్నది. ఈ సంస్థతో సమాజానికి ముప్పు పొంచి ఉన్నదన్నది. దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే సామర్థ్యం దీనికి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. తబ్లిగీ జమాత్‌ గురించి మసీదుల వేదికగా ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆ సంస్థ కార్యకలాపాలను ప్రజల దృష్టికి తేవాలని భావిస్తున్నామని పేర్కొన్నది. గతేడాది భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా బాటలో ఇతర ఇస్లామిక్‌ దేశాలు పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి.