గుండెపోటు వచ్చినా చలించని డ్రైవర్‌

బస్సును పక్కకు ఆపి ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ

చెన్నై,డిసెంబర్‌9(జనం సాక్షి  ): ఓ ఆర్టీసీ బస్సు వేగంగా వెళుతున్న క్రమంలోనే బస్సు డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి.. తనకు గుండెపోటు అని గుర్తించిన సదరు డ్రైవర్‌.. బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. బస్సులో ఉన్న 30 మంది ప్రాణాలను రక్షించి.. ఆపై ప్రాణాలు వదిలాడు డ్రైవర్‌. ఈ విషాద ఘటన తమిళనాడులోని మధురైకి సవిూపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. తమిళనాడు ఆర్టీసీ బస్సు గురువారం ఉదయం ఓ 30 మంది ప్రయాణికులతో అరప్పలయం నుంచి కొడైకెనాల్‌కు బయల్దేరింది. ఈ బస్సును నడుపుతున్న ఆరుముగమ్‌(44)కు ఉదయం 6:20 గంటలకు ఛాతీలో నొప్పి రావడంతో బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. అప్రమత్తమైన కండక్టర్‌ అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. అంతలోనే డ్రైవర్‌ కుప్పకూలిపోయాడు. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి తాను ప్రాణాలొదిలిన డ్రైవర్‌ పట్ల ప్రతి ఒక్కరూ సానుభూతి తెలిపారు. గత 12 ఏండ్ల నుంచి ఆరుముగమ్‌ తమిళనాడు ఆర్టీసీలో డ్రైవర్‌గా సేవలందిస్తున్నాడు. డ్రైవర్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.