సిరివెన్నెలకు మంత్రుల పుష్పాంజలి


ఆయన మరణం తెలుగుజాతికి తీరని లోటుమంత్రులు తలసాని, హరీష్‌ రావుల నివాళిహైదరాబాద్‌,డిసెంబర్‌1 (జనంసాక్షి):  సిరివెన్నల సీతారామశాస్త్రికి మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, హరీష్‌ రావులు నివాళి అర్పించారు. ఫిలిం చాంబర్‌లో ఆయన భౌతిక కాయం వద్ద వీరు పుష్పగుఛ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. కొత్తతరం గీత రచయితలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆదర్శమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సిరివెన్నెల మరణించడం తెలుగు చత్రసీమకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తీరని లోటన్నారు. ఫిల్మ్‌ చాంబర్‌లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సీతారామశాస్త్రి పాటలు తెలుగు తనం ఉట్టిపడేలా ఉగాది పచ్చడిలా, సంక్రాతి, దీపావాళి పండుగలా ఉంటాయన్నారు. వారికి పద్మశ్రీ, 11 సార్లు నంది అవార్డులు గొప్పవిషయమని చెప్పారు. ఆయన పాటల్లో చక్కని తెలుగు, కమ్మదం ఉంటుందని, అర్థం, పరమార్థం ఉంటాయని సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా ఉంటాయని చెప్పారు. చాలా తక్కువ వయస్సులో మరణించడం బాధాకరమన్నారు. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ పరిశ్రమకు, సాహిత్య రంగానికి తీరని లోటని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సినిమా పాటల్లో సిరివెన్నెలది ప్రత్యేక స్థానమన్నారు. ఫిల్మ్‌ చాంబర్‌లో సిరివెన్నల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి మంత్రి నివాళులర్పించారు. అశ్లీలం, ద్వంద్వార్థాలు లేని పాటలు రాసిన గొప్ప రచయిత అని, సినిమా పాటల్లోనూ సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. పండితులు, పామరులను సైతం మెప్పించిన గొప్ప వ్యక్తిత్వమని చెప్పారు.