ఒమిక్రాన్‌ అధ్యయానికి పదిరాష్ట్రాలకు కేంద్ర బృందాలు

 



దిల్లీ,డిసెంబరు 25(జనంసాక్షి):దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్‌ పాకగా.. 400లకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఒమిక్రాన్‌, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడిరచింది. ‘‘ఒమిక్రాన్‌, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్‌ నెమ్మదిగా సాగుతున్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఉన్నతస్థాయి బృందాలను పంపించాలని నిర్ణయించాం. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, మిజోరం, కర్ణాటక, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, రaార్ఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లనున్నాయి’’ అని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల్లో 3 నుంచి 5 రోజుల పాటు ఉండనున్నాయి. కొవిడ్‌ పరీక్షలు, కరోనా నిబంధనల అమలు వంటి అంశాలపై రాష్ట్ర అధికారులతో కలిసి పనిచేయనున్నాయి. దీంతో పాటు వ్యాక్సినేషన్‌ వృద్ధి, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత తదితర అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదించనున్నాయని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడిరచింది.దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 415కు పెరిగిన విషయం తెలిసిందే. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కొత్త వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత దిల్లీలో 79, గుజరాత్‌లో 43 కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. ఇందులో అత్యధికంగా కేరళలో 2,605, మహారాష్ట్రలో 1,410, తమిళనాడులో 597 కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే రాత్రి కర్ఫ్యూలు పెట్టాలని ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను సూచించిన విషయం తెలిసిందే. దీంతో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు మళ్లీ ఆంక్షలు అమల్లోకి తెచ్చాయి. క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలపై పలు చోట్ల నిషేధం విధించారు.