ధాన్యం కొనుగోళ్లలో కప్పదాటు వ్యవహారం

సామాజిక తెలంగాణ ఆకాంక్ష తీరలేదు

సమస్యల పరిష్కారంలో పాలకుల విఫలం: సిపిఐ
ఆదిలాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):   ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత పాలకులు మారారరని, పాలన మారలేదని సిపిఐ జిల్లా నాయకుడు కలవేన శంకర్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేవిూ లేదన్నారు. స్వరాష్ట్రంలో కూడా ఆత్మహత్యలు ఆగలేదని తెలిపారు. ఇది బాధాకరమైన విషయమన్నారు. ధాన్యం కొనగుళ్లలో రాష్ట్రప్రభుత్వం విఫలం కావడంతో పాటు కేంద్రంపై నెపం నెట్టి బాధ్యతలనుంచి తప్పుకో చూస్తున్నదని అన్నారు. రాజకీయంగగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ప్రజలకు పెద్ద మార్పు జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా పరిస్థితులు మారలేదన్నారు. తెలంగాణ సమస్య అంటే భూమి, నీళ్ల సమస్యేనని చెప్పారు. దానికోసమే కొట్లాట జరిదిందన్నారు. కానీ అదే నెరవేర లేదన్నారు. మా భూములు మాకని తెలంగాణ ప్రజలడిగినప్పుడు విూ భూములు విూకు కాదు, మూడున్నర ఎకరాలు ఇస్తామన్నారు, ఆచరణలో ఎవరికీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు, ఏదని అడిగితే సమాధానం లేదని తూర్పార బట్టారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అన్నారు...ఇది కూడా అతీగతి లేదని మండిపడ్డారు. పింఛన్‌ పెంచారు, భార్యకిస్తే భర్తకు లేదు, భర్తకిస్తే భార్యకు లేదని వృద్ధుల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. గూడు లేని వాళ్లకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని చెప్పిన పాలకులు విఫలమయ్యారని అన్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు భూ సమస్య అనేది పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యమనేది గంగలో కలిసిందని మండిపడ్డారు. అన్ని వర్గాల సామాజిక న్యాయం కోసం మరో తెలంగాణ సామాజిక ఉద్యమం రావాల్సి ఉందన్నారు. ప్రజలు ఇందుకు సిద్దం అవుతున్నారని అన్నారు.