కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు గుస్సా


` సీఎస్‌కు రూ.10వేల జరిమానా
హైదరాబాద్‌,డిసెంబరు 22(జనంసాక్షి): నాలుగేళ్లుగా కౌంటర్లు దాఖలు చేయనందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీఎస్‌కు రూ.10 వేలు జరిమానా విధించడంతోపాటు తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. నీటి పారుదల ప్రాజెక్టుల కోసం 2016లో జారీ చేసిన 123 జీవోను సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని నాలుగేళ్లుగా ప్రతీ విచారణలో హైకోర్టు ఆదేశిస్తోంది. కౌంటరు దాఖలు చేయాలని లేదా వ్యక్తిగతంగా హాజరు కావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను గత నెలలో న్యాయస్థానం మరోసారి ఆదేశించింది. దీనిపై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటర్లు దాఖలు చేయకపోవడమే కాకుండా.. కనీసం హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్‌ సైతం దాఖలు చేయలేదంటూ న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు జరిమానాగా విధించిన రూ.10వేలను ప్రధానమంత్రి కొవిడ్‌ సహాయ నిధికి చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే ఏడాది జనవరి 24కు వాయిదా వేసింది.