జనగామ సిఎం పర్యటనపై మంత్రుల సవిూక్షపర్యటనను విజయవంతం చేసేలా చర్యలు

అందరూ బాధ్యతతో వ్యవహరించాలన్న ఎర్రబెల్లి
ఉమ్మడి జిల్లా నేతలతో సవిూక్షించిన మంత్రి
హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి): జనగామలో సిఎం కెసిఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా నేతలు నిర్ణయించారు. ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి ఎర్రబెల్లి అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టారు. ఈ మేరకు ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనగామలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ కలిసి సవిూక్ష నిర్వహించారు. బంజారాహిల్స్‌ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌ రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌ రావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన సందర్భంగా చేపట్టే సంక్షేమ, అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. అన్ని పనులు సమన్వయంతో చేయాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి పనులు వాటి కార్యాచరణ, ప్రస్తుతం సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను సిద్ధం చేయాలన్నారు. ముఖ్యమంత్రి సభకోసం మండలాల వారీగా ఇంచార్జీలకు బాధ్యత అప్పగించారు. ఈ నెల 17న సభా స్థలాన్ని మండలాల ఇంఛార్జిలతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించనున్నారు.