తొలి ముస్లిం మహిళా ఎస్పీగా సలీమా


అంచెలంచెలుగా ఎదిగిన ఎస్‌ఐ కూతురు

ఖమ్మం,డిసెంబర్‌23 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన షేక్‌ సలీమా నిలిచారు. దీంతో ఆమెను పలువురు పోలీస్‌, ఇతర అధికారులు అభినందనలతో ముంచెత్తారు. ఓ సామాన్య కానిస్టేబుల్‌ కూతురుగా పోలీస్‌ శాఖలో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు ఎస్పీ స్థాయికి చేరారు. ఈ నెల 21న విడుదలైన నాన్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ జాబితాలో సలీమా చోటు దక్కించు
కున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేం గ్రామానికి చెందిన లాల్‌ బహదూర్‌, యాకూబ్‌ బీ దంపతుల మొదటి కుమార్తె సలీమా. సలీమా తండ్రి లాల్‌ బహదూర్‌ ఖమ్మంలో ఎస్సైగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. సలీమా... డిగ్రీ వరకు ఖమ్మంలోనే చదువుకొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో పీజీ చేశారు. గ్రూప్‌ ఉద్యోగాలకు ప్రిపేరై 2007లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో డీఎస్పీగా తొలి పోస్టింగ్‌ పొందారు. ఆ తరువాత అంబర్‌పేట పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా, మాదాపూర్‌లో అడిషనల్‌ కమిషనర్‌ (అడ్మిన్‌)గా పనిచేశారు.ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీగా పనిచేస్తున్నారు. సలీమా కుటుంబంలోని అందరూ ఉద్యోగులు కావడం విశేషం. సలీమాకు ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు ఉన్నారు. సోదరి జరీనా సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఇటీవలే ఏపీలో గ్రూప్‌ `1 మెయిన్స్‌కు ఎంపికయ్యారు. మరో చెల్లెలు మున్నీ ఖైరతాబాద్‌ ఎంవీఐగా పనిచేస్తున్నారు. తమ్ముడు ఖాసిమ్‌ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ వైద్యశాలలో వైద్యుడిగా స్థిరపడ్డారు. సలీమా భర్త కూడా సాప్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు. సలీమా ఐపీఎస్‌కు ఎంపికవడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వగ్రామంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.