కూతురుని కాపురానికి తీసుకెళ్లడం లేదన్న కక్ష


అల్లుడి కుటుంబంపై దాడి చేసిన మామ

దాడిలో అత్త మృతి..పలువురికి తీవ్ర గాయాలు
నల్లగొండ,డిసెంబర్‌21( జనం సాక్షి): జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని కాపురానికి
తీసుకెళ్లడంలేదని కోపంతో ఓ తండ్రి అల్లుడి కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి వియ్యంకురాలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నిడమనూరు మండలం బొక్కమంతల పహాడ్‌ గ్రామానికి చెందిన జ్లలెపల్లి సూరయ్య తన కూతురు శ్యామలను అత్తింటి వారు కాపురానికి తీసుకెళ్లడం లేదు. దీంతో వారి కుటుంబం పై పగ పెంచుకున్న సూరయ్య అల్లుడి కుటుంబంపై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో సూరయ్య అల్లుడి తల్లి అచ్చమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అల్లుడు శివనారాయణ, అతడి తండ్రి భిక్షం, శివనారాయణ అమ్మమ్మ నారమ్మల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను మిర్యాలగూడ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.