ఒమిక్రాన్‌ పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి


` టెస్ట్‌ల సంఖ్య పెంచండి
` ప్రధాని మోదీఉన్నత స్థాయి సవిూక్షా సమావేశం
దిల్లీ,డిసెంబరు 23(జనంసాక్షి): దేశంలో కరోనా పరిస్థితి, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సవిూక్షా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి ప్రధాని కీలక సూచనలు చేశారు. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. పరిస్థితిని అదుపు చేయడంలో చురుగ్గా పనిచేయాలని, సత్వర చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్‌ టెస్ట్‌లను పెంచడంతో పాటు వైరస్‌ బారిన పడినవారితో కాంటాక్టు అయినవారిని ట్రేసింగ్‌ చేయడంలో వేగంగా పనిచేయాలన్నారు.అలాగే, వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరం చేయాలని, ఆరోగ్య మౌలిక వసతులను మరింతగా బలోపేతం చేసుకోవాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు. అత్యధిక కేసులు నమోదవుతున్న, వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న, ఆరోగ్య వసతులు తగినవిధంగా లేని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సహకరించేలా కేంద్ర బృందాలను పంపాలని ఆదేశించారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా అందరూ సమన్వయంతో, పరస్పర సహకారంతో సమర్థంగా పనిచేయాలన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 88 శాతం అర్హులైన జనాభాకు కొవిడ్‌ తొలి డోసు టీకా పంపిణీ చేయగా.. 60 శాతానికి పైగా జనాభాకు రెండో డోసు పూర్తి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడిరచింది.అలాగే, కొవిడ్‌పై పోరులో టెలీమెడిసిన్‌, టెలీ కన్సల్టేషన్‌తో పాటు సాంకేతిక వ్యవస్థను సమర్థంగా వాడుకోవాలని మోదీ సూచించారు. ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు వీలుగా పరికరాలను ఇన్‌స్టాల్‌ చేసుకొని పూర్తిస్థాయిలో పనిచేసేలా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కరోనాపై యుద్ధం ముగిసిపోలేదన్న ప్రధాని.. కొవిడ్‌ నుంచి రక్షణ పొందేందుకు నిరంతర చర్యలు నేటికీ అవసరమన్నారు. అర్హులైన ప్రజలందరికీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని రాష్ట్రాలకు మరోసారి గుర్తుచేశారు