వరి సాగు వద్దన్నందుకు రైతు ఆవేదన

సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య

మెదక్‌,డిసెంబర్‌10 జనంసాక్షి: వరిపంట సాగు వేయొద్దంటున్నందుకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు లేఖ రాస్తూ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వైపు వరి సాగుపై గందరగోళం.. మరో వైపు పండిరచిన వరి పంటకు మద్దతు ధర పలక్కపోవడం... వీటికి తోడు చేతికి అందివచ్చిన కొడుకు ఉద్యోగం రాక ఖాళీగా ఉండడం తదితర కారణాలు రైతు ఉసురు తీసుకున్నాయి. హావేలిఘనపూర్‌ మండలం బోగడ భూపతిపూర్‌లో రైతు కర్ణం రవి పొలానికి పుష్కలంగా నీళ్లుండడంతో వర్షాకాలంలో సన్నరకం వరి వేశాడు. దిగుబడి తక్కువగానే వచ్చింది. చేతికి వచ్చిన పంటకు మద్దతు ధర పలకడం లేదు. ఇప్పుడు యాసంగిలో పుష్కలంగా నీరున్నా ఏం పండిరచాలనేది అర్థం కాని గందరగోళం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ కు స్వహస్తాలతో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేశాడు. వరి తప్ప వేరే పంట పండని పరిస్థితి ఉంది.. నేను ఏం చేయాలని సీఎం కేసీఆర్‌ ను ప్రశ్నిస్తూ లేఖ రాసి తన పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంజనీరింగ్‌ చేసిన కొడుకు ఉద్యోగం లేక ఖాళీగా ఉండటం, నీరు పుష్కలంగా ఉన్న వరి వద్దంటున్నారు. ఇప్పటికే సాగు చేసిన సన్న వరి దిగుబడి తక్కువగానే వచ్చినా.. వచ్చిన పంటకు ధర లేదని వాపోతూ సీఎం కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు  రవికుమార్‌ తన స్వహస్తాలతో లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం విషాదం  రేపింది. `