ఏసు అంటే రక్షకుడు

 క్రీస్తు జన్మించిన రోజునే క్రిస్మస్‌

విజయవాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): ఏసు క్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్‌గా జరుపుకుంటారు. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా కైస్త్రవులు జరుపుకునే పండుగ క్రిస్మస్‌. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కైస్త్రవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. క్రిస్‌మస్‌ కైస్త్రవులకు ముఖ్యమైన పండగ.
దేవుడు కొలువుదీరేది ఆత్మలో అయితే... దానికి మార్గం` క్రీస్తు బోధించిన ప్రేమతత్వం, కరుణ, క్షమ. ’సంపూర్ణ మానవత్వమే మనిషిని మహాపురుషుడిగా, దైవస్వరూపుడిగా మారుస్తుంది’` ఇదే క్రిస్మస్‌ పర్వదినం ద్వారా సమస్త మానవాళికి అందే శుభసందేశం. కొంతమంది కైస్త్రవులు డిసెంబర్‌ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్‌ చర్చిలకు చెందిన కైస్త్రవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. జీసస్‌ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణా మయుడుగా, దయామయుడుగా ఆయన క్రెస్తవుల ఆరాధనలను అందుకుంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కైవ్రస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్‌. క్రీస్తు జన్మించిన రోజు కావడం వల్లే క్రిస్మస్‌ జరుపుకుంటున్నారు. రెండు వేల ఏళ్ల కిందట రోమ్‌ సామ్రాజ్యాన్ని పాలించే ఆగస్టస్‌ సీజర్‌ తన రాజ్యంలో ఎంత మంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్లు డిసెంబరు 25 తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్‌ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గాబ్రియేల్‌ అనే దేవదూత కలలో కనబడి ’ఓ మేరీ! నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావు. నీకు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలి. అతడు దేవుని కుమారుడు’ అని చెప్పాడు. నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన కైస్త్రవ మత మూల పురుషుడు. ఇందులో క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్‌ (’ఆభిషిక్తుడు’) అనే అర్ధం వచ్చే పదం నుండి పుట్టిన ముకుటం. ఇది హీబ్రూలో ’మెసయ్యా’కు సమానార్ధము కలపదము. రెండువేల సంవత్సరాల క్రితం సంగతి. ఒక అభాగ్యురాలు, సమాజ నిరాపేక్షకు గురైన ఒక స్త్రీ ఆ జనం ఎదుట దోషిగా నిలబడిరది. ఆమె చుట్టూ ఉన్నవారి చేతుల్లో రాళ్ళు. పాపం చేసినవారిని రాళ్ళతో కొట్టి చంపడం ఆ దేశంలో ఉన్న దారుణమైన ఆచారం. ఇంతలో వారి మధ్యలోకి ఒక ఆజానుబాహువు వచ్చాడు. ఆయన ముఖంలో తేజస్సు. రాళ్ళతో కొట్టబోతున్నవారు ఒక్కక్షణం ఆగారు. ’విూలో పాపం చేయనివారెవరు? పాపం చేయని వారు ఎవరైనా ఉంటే, ముందుగా వారే రాయి విసరండి’ అన్నాడాయన. అంతా ఒక్కసారి వెనుతిరిగారు. వారి చేతుల్లోని రాళ్ళు కింద పడ్డాయి. ఆమె చేతులు జోడిరచి ఆయన ముందు మోకరిల్లింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పాపం చేసినవారికి శిక్ష విధించడం కాదు. పాపమే మరణించాలి. అలా జరిగితే పాపంలేని మనిషి పాపరహితుడై యేసుక్రీస్తులా మారతాడని దేవుని నమ్మకం. అందుకే నశించిన దాన్ని వెదికి రక్షించే నిమిత్తం ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును ఈలోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి పాపపరిహారార్థం దేవుడు నరుడిగా జన్మించిన పవిత్రమైన రోజే క్రిస్మస్‌. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళి బాలయేసును దర్శించిన ముగ్గురు జ్ఞానులు పరమానంద భరితులయ్యారు. ఆ సంతోషానికి గుర్తుగా వారు బాలయేసుకు మూడు కానుకలను సమర్పించారు. అవి బంగారము, బోళం, పరిమళ సాంబ్రాణి. వారు సమర్పించిన బంగారం క్రీస్తు ప్రభువు పరిశుద్ధతకు, పవిత్రతకు చిహ్నంగా కనబడుతుంది. బోళం సమర్పణకు సూచన. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమతో సమర్పించిన రీతిలో అందరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం, ద్వేషాన్ని విడనాడటం క్రిస్మస్‌ పర్వదినం ప్రాముఖ్యం. ఇక ఆనాడు జ్ఞానులు కానుకగా సమర్పించిన పరిమళ సాంబ్రాణిని ఆరాధనకు సూచనగా లేఖనాలు పేర్కొంటాయి. అహంకారంతో అవమానం, వినయ విధేయతలతో జ్ఞానం కలుగుతాయి. నీ కన్నతండ్రి హితోపదేశం విను, నీ తల్లి వృద్దాప్యంలో ఉంటే ఆమెను నిర్లక్ష్యం చేయకు` ఇవి క్రీస్తు పలికిన అమృత వాక్కులు. తప్పిపోయిన గొర్రె వంటి అమాయక ప్రజలను వెదికి రక్షించేందుకు ఈ లోకంలోకి వచ్చిన ప్రభువుగా ఆయనను కీర్తిస్తారు. ఇందుకు సాదృశ్యంగా ఆయన జన్మించినప్పుడు ఆ శుభవర్తమానం అమాయకులైన గొర్రెల కాపరులకే ముందుగా తెలియడం ఆశ్చర్యానుభూతి కలిగించే విషయం.