గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
గెజిట్ నోటిఫికేషన్ విడుదలసిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సిరికొండ
హైదరాబాద్,డిసెంబర్14(జనంసాక్షి ): గవర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శానసమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఈ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ 16వ తేదీతో ముగిసింది. ఆయన స్థానంలో మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. మధుసూదనాచారిని మండలికి నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మంగళశారం నుంచి మధుసూదనాచారి పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు వెలువరించింది. 1982లో తెలుగుదేశంలో పార్టీలో చేరిన మధుసూదనాచారి.. 1994`99 మధ్య కాలంలో శాయంపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటే ఉన్నారు. టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో మధుసూదనాచారి ఒకరు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నూతన రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన ఖాళీగా ఉన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిరికొండ మధుసూదనాచారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహానికి మధుసూదనాచారి పూలమాల వేసి నివాళులర్పించారు.