` పట్టుకున్న అధికారులు
శంషాబాద్,డిసెంబరు 7(జనంసాక్షి):నకిలీ వీసాలు, ధ్రువపత్రాలతో గల్ఫ్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొంత మంది దళారులు డబ్బులు తీసుకొని నకిలీ వీసాలు, ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. వీరందరికీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి టికెట్లు బుక్ చేశారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మహిళల వీసాలు, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు అవన్నీ నకిలీవని తేల్చారు.పట్టుబడ్డ మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. మహిళలను ప్రశ్నించడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘ఒకే దేశానికి రెండు వీసాలతో మహిళలు బయలుదేరారు. విసిటింగ్ వీసా ఇండియన్ ఇమిగ్రేషన్ వద్ద చూపించి ఎంప్లాయిమెంట్ వీసా కువైట్‌లో చూపించాలని దళారులు మహిళలకు చెప్పారు. వీసా, ధ్రువపత్రాలు పరిశీలించే సమయంలో ఈ విషయాన్ని ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ముంబయిలో ఉన్న ప్రధాన ఏజెంట్ వీరిని దేశం దాటిస్తున్నట్లు సమచారం. ఏపీలో మరో ఇద్దరు సబ్ ఏజెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏజెంట్లపై 420, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. 6 నెలల క్రితం ఇదే ఏజెంట్ ముఠా 20 మంది మహిళలను దేశం దాటిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కువైట్‌లో ఉన్న ట్రావెల్ ఏజెంట్లతో ముంబైకి చెందిన ప్రధాన ఏజెంట్ కుమ్మక్కైనట్లు గుర్తించాం’’ అని ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు.