గ్రామాల్లో సమాచార సేకరణ

అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు ఆరా

ఖమ్మం,డిసెంబర్‌21( జనం సాక్షి): మంత్రి నిరంతర సవిూక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రధానంగా గ్రామస్థాయిలో అన్ని సమస్యలను ఆకళింపు చేసుకోవాలని, అడిగిప్పుడు సమాచారం అందించేలా చూడాలని మంత్రి పువ్వాడ అజయ్‌ అధికారులకు స్పష్టత ఇచ్చారు. దీంతో గ్రామాల్లోకి వెళ్లినప్పుడు అధికారులు సమాచార సేకరణ చేస్తున్నారు. ఎంపీడీవోలు గ్రామాల సందర్శన సమయంలో అంగన్‌వాడీలు, గురుకులాలు, పీహెచ్‌సీలను కూడా పరిశీలించి అందులో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, విద్యార్థులు, రోగులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయని ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించాలని మంత్రి సూచించారు. దీంతో అధికారులు ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో అధికారులు సందర్శన చేస్తూ అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించడం తోపాటు గ్రామాల్లో నిర్దేశితన పనులపై తీసుకోవాలని సూచించారు. ఇళ్లలోని మురుగునీరు రోడ్లపైకి రాకుండా అధికారులు ప్రజలకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని, మిషన్‌ భగీరథ పనుల్లో భాగంగా పైపులైన్లు ఏర్పాటు చేసే సమయంలో రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు తొలగించకుండా చూసుకోవాలని, టెలిఫోన్‌ కేబుల్‌ వైర్లు కూడా తెగిపోకుకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలస్థాయి అధికారులు గ్రామస్థాయి ఉద్యోగులతో పనిచేయించాలని,రెండు నియోజకవర్గాల్లోని 24 శాఖలకు చెందిన ఉద్యోగులతో అధికారులు సమర్థవంతంగా పనులు చేయించాలని, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.