నేటి క్రిస్మస్ వేడుకల నిర్వహణపై తలసాని పరిశీలన
సిఎం రాకతో నేడు ట్రాఫిక్ ఆంక్షల విధింపు
హైదరాబాద్,డిసెంబర్20( జనం సాక్షి ): ప్రభుత్వమే క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి క్రిస్మస్ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తలసానితెలిపారు. సోమవారం ఆయన నగరానికి చెందిన ఎంఎల్‌ఏలు, ఎమ్మెల్సీలతో కలిసి ఎల్బి స్టేడియంలో ఈ నెల 21 వ తేదీన నిర్వహించే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలు, విందు ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్ల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలలో ముఖ్యమంత్రి, పలువురు కైస్త్రవ ప్రముఖులతో కలిసి పాల్గొంటారని చెప్పారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంకు సంబంధించి బ్రహ్మాడంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పేద కైస్త్రవులకు ప్రభుత్వం గిప్ట్ ప్యాక్ లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని చర్చిలలో క్రిస్మస్ విందులను నిర్వహిస్తూ వస్తుందని అన్నారు. నగరంలోని అన్ని నియోజకవర్గాలలో ఎంఎల్‌ఏ ల పర్యవేక్షణలో క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. క్రిస్టియన్ సంక్షేమ భవన్ నిర్మాణం, చర్చిలు, గ్రేవ్ యార్డ్ ల అభివృద్ధి పై త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎంఎల్సీ లు ఎంఎస్ ప్రభాకర్, రాజేశ్వర్ రావు, ఎగ్గే మల్లేషం,ఎంఎల్‌ఏ లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్‌ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, మైనార్టీ కార్పోరేషన్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ గ్జజెల నగేష్, నాంపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి ఆనంద్ గౌడ్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం విందును ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్ వైపుకు వెళ్లే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడిరచారు. అధికారులు మాట్లాడుతూ... బిజెఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్ అనుమతించబడదని, నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మళ్లించబడుతుందని తెలిపారు. అబిడ్స్ రోడ్ నుండి ట్రాఫిక్‌ను బిజెఆర్ విగ్రహం వైపు అనుమతించబోరని స్పష్టం చేశారు. ఆ వైపు వచ్చే వాహనాలను ఎస్‌బిఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి ట్రాఫిక్ బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద లిబర్టీ వైపు మళ్లించబడుతుందని, వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.