టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు కెటిఆర్‌ శుభాకాంక్షలు

ప్రతి ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌దే విజయమని వ్యాఖ్య

హైదరాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి ): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తున్నదని కేటీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాకారం కోసం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పాలనకు, ప్రజలు ప్రతి ఎన్నికలోనూ పట్టం కడుతున్నారని పేర్కొన్నారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పన్నెండుకు 12 స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాలతో స్థానిక సంస్థలు ఎంతగానో బలోపేతమయ్యాయయని, ముఖ్యంగా ప్లలె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా స్థానిక సంస్థలకు ప్రతినెల టంచన్‌ గా నిధులను అందిస్తూ స్థానిక సంస్థలను ఆర్థికంగానూ బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి కార్యక్రమాల ఫలితంగానే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఘనమైన విజయం అందించారన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు అందరికీ అభినందనలు తెలిపిన కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు
తెలిపారు.