రాజ్యాంగబద్ధంగా పాలన సాగాల్సిందే..

 ` ఇష్టారాజ్యాన్ని కోర్టు అనుమతించదు
` న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది
` సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ
విజయవాడ,డిసెంబరు 26(జనంసాక్షి):రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో దివంగత జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు అని జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు నమ్మేవారని చెప్పారు. స్వగ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించారని.. వాలీబాల్‌ తదితర క్రీడలను ఆయన ప్రోత్సహించేవారన్నారు. జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు ఆదర్శాలు ఆయన తనయుడు జస్టిస్‌ లావు నాగేశ్వరరావుకు స్ఫూర్తి అయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా ‘భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు’ అనే అంశంపై సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత అభివృద్ధి, ఆధునీకరణ, పారిశ్రామికీకరణ వైపు మళ్లడంలో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. ‘‘ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. రాజ్యాంగ పరిధులు తెలుసుకుని అందరూ పనిచేయాలి. జడ్జిలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా ముఖ్యం. హ్యాకింగ్‌ అతిపెద్ద సమస్యగా మారింది’’ అని అన్నారు.1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిరదని.. సరైన సమయంలో సరైన నిర్ణయంతో దాన్ని అధిగమించామని చెప్పారు. ఆ తర్వాత కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిందని.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ఆర్థిక సంస్కరణలు వచ్చాయని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థ కూడా ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొందన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపునిచ్చారు.