వ్యాక్సిన్‌ తీసుకున్న వారికే జీతాలు


కోఆపరేటివ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి )  :  తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌  కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులు కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకుంటేనే జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా టీకా తీసుకోనివారికి జీతాలు ఇచ్చే ప్రసక్తే లేదని అపెక్స్‌ బ్యాంక్‌ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం డిసెంబర్‌ 4, 2021 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ నిబంధన టీఎస్‌ సీఏబీ హెడ్‌ క్వార్టర్స్‌తో పాటు అన్ని బ్రాంచ్‌లకు వర్తిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌ సీఏబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నేతి మురళీధర్‌ మాట్లాడారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి ఉద్యోగి తమ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను తప్పకుండా సంబంధిత వర్గాలకు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు సర్టిఫికెట్‌ ఉంటేనే డిసెంబర్‌ జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. ఒక వేళ వ్యాక్సిన్‌ తీసుకొని యెడల.. కారణాలను తెలుపుతూ రిపోర్ట్‌ ఇవ్వాలన్నారు. ఈ రిపోర్టులను డిసెంబర్‌ 15వ తేదీలోపు సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. వంద శాతం వ్యాక్సినేషన్‌కు ప్రతి ఉద్యోగి సహకరించాలని ఎండీ నేతి మురళీధర్‌ కోరారు.