ఉద్యోగులను,నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌


317 రద్దు అయ్యే వరకు పోరాడుతాం: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

కరీంనగర్‌,జనవరి29 (జనంసాక్షి): ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌, ఇప్పుడు ఉద్యోగులను కూడా కుదురుగా పనిచేసుకోకుండా జీవో 317తో చిచ్చు పెట్టారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలు తెలుసుకోకుండా,ప్రగతిభవన్‌ వీడకుండా ఉంటే బాధలు ఎలా తెలుస్తాయని అన్నారు. కెసిఆర్‌ తీరుతో రాష్ట్రంలో ఉద్యోగ, నిరుద్యోగులు ఆందోళనబాట పడుతున్నారని అన్నారు. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ప్రాతిపదికన బదిలీలు చేపట్టాలన్నారు. శాశ్వతంగా 124 జీవో,317జీవోను రద్దు చేయాలన్నారు. స్థానిక ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, 371 డి ఇప్పటికి అమలులో ఉందని గుర్తు చేశారు. 371జీవోను సవరణ చేసే అధికారం ఎవ్వరికి లేదన్నారు. స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా కేవలం సినీయార్టీ పరంగా ఉద్యోగులను భర్తీ చేయడం సరికాదన్నారు. కేంద్రహోం శాఖ, రాష్ట్రపతి కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిచిందన్నారు. భర్త ఒక దగ్గర?భార్య ఒక దగ్గర పోస్టింగులు ఇస్తున్నారని మండిపడ్డారు. దంపతుల్లో ఒకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే మాకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటుందని అది సరైన పద్ధతి కాదన్నారు. న్యాయ స్థానాలు స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు. 124 జి.ఓ అమలుతో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. .371 డి జీవోకు అనుగుణంగా నియమాకాలు, బదీలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సర్వీస్‌ బుక్‌లో పేర్కొన్న స్థానికత ఆధారంగా బదీలీలు చేపట్టాలన్నారు.