విద్యాసంస్థల ప్రత్యక్ష తరగతులపై సందిగ్ధత

 


హైకోర్టు విచారణ తరవాతనే నిర్ణయించే ఛాన్స్‌
ప్రైవేట్‌ పాఠశాలల శానిటైజేషన్‌పై పర్యవేక్ష కరవు
హైదరాబాద్‌,జనవరి29 (జనంసాక్షి) : విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 9,10 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు పాఠశాలలను ప్రారంభించే అవకాశం లేకపోవచ్చు. ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగించినా తదుపరి ఎప్పుడు తెరుస్తారన్నది తెలియదు. హైకోర్టుకు కూడా ఇదే విషయం నివేదించారు. ఈ క్రమంలో పాటశాలలను తెరిచే విషయంలో
ప్రతిష్టంభన ఉంది. అయితే ఒకవేళ పాఠశాలలు తెరవాల్సి వస్తే మళ్లీ దీనికి అనుగుణంగా విద్యాశాఖ
ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్‌ పాఠశాలలు కూడా సిద్దం కావాలి. పాఠశాలలను శుభ్రం చేసి కరోనా సోకకుండా శానిటైజేషన్‌ చేసే పనులు చురుకుగా సాగాలి. అధికారుల పర్యవేక్షణలో ఇవి సాగుతాయి. అయితే ఇదే దశలో ప్రైవేట్‌ విద్యాసంస్థలను పర్యవేక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తర్వాతే 1నుంచి 8 తరగతి విద్యార్థులను పాఠశాలకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టుకు పాఠశాలల పునఃప్రారంభంపై ఎలాంటి హావిూ ఇవ్వకున్నా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విద్యాసంవత్సరం పూర్తికి గడువు దగ్గర పడుతున్న వేళ దీనికి అనుగుణంగా పాఠ్యప్రణాళిక పూర్తి చేయాల్సి ఉంటుంది. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్న దరిమిలా విద్యార్థులకు ప్రత్యక్ష బోధన లేకపోతే ఇబ్బందులు పడతారనే ఉద్దేశ్యంతో పాఠశాలలు ప్రారంభించక తప్పడం లేదని విద్యాశాఖ చెబుతోంది. కరోనా ఇంకా కొనసాగుతున్న పరిస్థితుల్లో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు సంకోచిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు అంగీకరించిన పక్షంలోనే విద్యార్థులను అనుమతించాలని విద్యాశాఖ అధికారులకు స్పష్టీకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ప్రత్యేక పారిశుద్ద్య పనులు సాగుతు న్నాయి. ప్రైవేట్‌లో పాఠశాలలపై పర్యవేక్షణ ఉండాలని, ఫీజుల నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే పరిమిత సంఖ్యలోనే విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రలు సమ్మతిస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించేందుకు కొంత విముఖత ప్రదర్శిస్తున్నా పాఠశాలలు ప్రారంభమైన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లోని ఆయా మండలాల్లో పాఠశాలల వారీగా జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల హాజరు శాతంపై విూమాంస నెలకొంది. అధికార యంత్రంగం విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కొవిడ్‌ నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయనుంది. ముఖ్యంగా ఇప్పటికే పాఠశాలల శానిటైజేషన్‌ పక్రియ ముమ్మరంగా సాగుతోంది. ప్రతి పాఠశాలలో విధిగా విద్యార్థులకు శానిటైజర్లు,చేతులు శుభ్రం చేసుకు నేందుకు నీరు, మరుగుదొడు,మూత్రశాలల ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు తరగతులకు హాజరయ్యే విద్యార్థులు విధిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించనున్నారు. తరగతి గదుల్లోనూ ప్రతి విద్యార్థికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో తరగతి గదిలో గరిష్ఠంగా 40మంది విద్యార్థులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఒక బెంచీపై కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే స్థానం కల్పిస్తున్నారు. ఇక మధ్యాహ్నం భోజన సమయంలోనూ ఒకే దగ్గర చేరకుండా నిర్దేశిత సంఖ్యల ప్రకారమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైతే విద్యార్థులు ఎలా ఉండాలన్న దానిపైనా కసరత్తు చేస్తున్నారు.