తెలంగాణపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు



రాజ్యసభలో టిఆర్‌ఎస్‌ ప్రివిలేజ్‌ మోషన్‌

పోడియం ముందు ఎంపిల నిరసన
రాజ్యసభ నుంచి వాకౌట్‌...
న్యూఢల్లీి,ఫిబ్రవరి10(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై సభాహక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు కె.కేశవరావు ఆధ్వర్యంలో రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. 187వ నిబంధన కింద టీఆర్‌ఎస్‌ ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌, లింగయ్య యాదవ్‌, సురేశ్‌ రెడ్డి ఈ నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు. తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంటులో పాస్‌ అయిన బిల్లును అవహేళన చేయడం సరికాదని తెలిపారు. పార్లమెంటును, సభాపతులను అవమానపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడిరచారు. ఈ నెల 8న ప్రధాని రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇచ్చిన సందర్బంగా మాట్లాడారు. పార్లమెంట్‌ తలుపులు మూసేసి, పెప్పర్‌ స్పే కొట్టి బిల్లు పాస్‌ చేశారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో నోటీసులు ఇవ్వడంతో పాటు వెల్‌లోకి దూసుకెళ్లి టిఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేశారు. అలాగే రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఇవాళ సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే.. టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లారు. సురేశ్‌ రెడ్డి, సంతోష్‌ కుమార్‌, బడుగల లింగయ్య యాదవ్‌లు వెల్‌లోకి వెళ్లి నిరసనలు వ్యక్తం చేశారు. ప్రధానిపై ఇచ్చిన ప్రివిలేజ్‌ మోషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కేశవరావు డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ను కోరారు. ఆ సందర్భంలో ఆయన స్పందిస్తూ.. సభా హక్కుల నోటీసు అందిందని, కానీ దానిపై చైర్మెన్‌ వెంకయ్య నిర్ణయం తీసుకుంటారని హరివంశ్‌ తెలిపారు. చైర్మెన్‌ పరిశీలన కోసం ప్రివిలేజ్‌ నోటీసును పంపినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ తో పాటు ఇతర విపక్షాలు కూడా టిఆర్‌ఎస్‌ వాదనతో ఏకీభవిం చిచాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా టిఆర్‌ఎస్‌ కు మద్దతు పలికారు. ప్రివిలేజ్‌ నోటీసుపై ఛైర్మన్‌ నిర్ణయం తీసుకునే వరకు సభకు వెళ్లరాదని తెరాస ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. ప్రధానమంత్రి తీరుపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాన చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిరచారు. అదేవిధంగా ఎనిమిదేళ్ల తర్వాత కూడా ప్రధాని విూడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించకుండా, విూడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలపైనే ఆధారపడాల్సి రావడం సిగ్గుచేటు అన్నారు. రెండు సభల్లో పాసైన బిల్లుపై ప్రధాని కామెంట్‌ చేయడం శోచనీయమన్నారు. ప్రధాని మోదీపై లోక్‌సభలో కూడా ప్రివిలేజ్‌ నోటీసు తెరాస ఎంపీలు ఇవ్వనున్నారు. ఈ మధ్యాహ్నం స్పీకర్‌ను కలిసి ప్రివిలేజ్‌ నోటీసు ఇస్తామన్నారు.