గోవాను పట్టిపీడిస్తున్న నిరుద్యోగం

 

గోవాలో టూరిజం పునరుద్ధరణకు చర్యలు
ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ హావిూలు
పనాజీ,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  గోవా అభివృద్ధికి ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడం కీలకమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. గోవాలో మైనింగ్‌, టూరిజం రంగాల పునరుద్ధరణకు తమ పార్టీ పాటుపడుతుందని భరోసా ఇచ్చారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ రాష్ట్ర ప్రజలపై పలు హావిూలు గుప్పించారు. గోవాలో నిరుద్యోగ సమస్య యువతను వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు పెరిగేందుకు గోవాలో టూరిజం పునరుద్ధరణకు తాము చర్యలు చేపడతామని హావిూ ఇచ్చారు. మైనింగ్‌ను చట్టబద్ధంగా పునఃప్రారంభించేందుకు కసరత్తు సాగిస్తామని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మార్గోవాలో శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ గోవా అభివృద్ధికి తమ వద్ద సరైన విజన్‌ ఉందని స్పష్టం చేశారు. న్యాయ్‌ పధకం ప్రవేశపెడతామని, అర్హులైన మహిళల ఖాతాల్లో నెలకు రూ 6000 జమ చేస్తామని చెప్పారు. మహిళలకు 30 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తాము విస్పష్ట మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గోవాను ఐటీ హబ్‌లా మలిచేందుకు కృషి చేస్తామని చెప్పారు. పార్టీలు మారే వారికి వలస పక్షులకు తాము టికెట్లు ఇవ్వలేదని తేల్చిచెప్పారు. కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హావిూలను విస్మరించారని దుయ్యబట్టారు.
గత ఐదేండ్లుగా మోదీ దేశానికి చేసిందేవిూ లేదని మండిపడ్డారు. 2014లో కోట్ల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ప్రస్తుతం ఉపాధిపై నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఉద్యోగాల పేరుతో మోదీ దేశ యువతను మోసగించారని విరుచుకుపడ్డారు. దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, పర్యావరణం వంటి వాస్తవ అంశాలను ప్రదాని మోదీ ప్రస్తావించరని దుయ్యబట్టారు. ఇక ఈనెల 14న ఒకే దశలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.