వేములవాడ రాజన్నకు భారీగా కానుకలు

రికార్డు స్థాయిలో 3కోట్లకు పైగా ఆదాయం

వేములవాడ,ఫిబ్రవరి10(జనంసాక్షి): వేములవాడ రాజన్న హుండీ ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. కేవలం 12 రోజుల్లో రూ.3 కోట్లకుపైగా ఆదాయం సమకూరడం ఆలయ చరిత్రలోనే ఇదే తొలిసారి. మేడారం సమ్మక్క`సారక్క జాతరకు ముందుగా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో పెద్దమొత్తంలో ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత నెల 27 నుంచి భక్తులు స్వామి వారికి సమర్పించిన ఆదాయాన్ని ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో రెండు రోజులపాటు లెక్కించారు. మంగళవారం నాటికి హుండీ ద్వారా రూ.2.15 లక్షలు సమకూరాయని అధికారులు చెప్పారు. బుధవారం మరో రూ.92,92,366లు నగదు రూపంలో వచ్చాయని ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి తెలిపారు. దీంతో రాజన్న హుండీ ఆదాయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 12 రోజుల్లోనే రూ.3 కోట్లకు పైగా ఆదాయం లభించిందని వెల్లడిరచారు. ఇక భక్తులు 289 గ్రాముల బంగారం, 12 కిలోల 944 గ్రాముల వెండిని కానుకల రూపంలో రాజన్నకు సమర్పించుకున్నారని తెలిపారు.