ఊపందుకున్న రియల్‌ బూమ్‌

 


ఎకరా కోటి అంటున్న రైతులు
భూములకు ధరలతో రైతుల్లో ఆనందం
మెదక్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత హైదరాబాద్‌కు చేరువగా ఉన్న పలు ప్రాంతాల్లో రియల్‌ బూమ్‌ ఊపందుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వెంచర్లు వెలుస్తున్నాయి. రాష్ట్ర రాజధానికి కేవలం 40 కిలోవిూటర్ల దూరంలో ఉండడంతో మెదక్‌ జిల్లా పరిసర ప్రాంత భూములకు డిమాండ్‌ పెరిగింది. ప్రధాన రోడ్లతో పాటు గ్రావిూణ ప్రాంత రోడ్లన్నీ బీటీలుగా మారడంతో రవాణా సౌకర్యం పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో రియల్‌ వ్యాపారం చేసే వారితో పాటు బడావ్యక్తులు ఇక్కడి భూములపై కన్నేశారు. నియోజకవర్గంలో ప్రధాన రోడ్లకు ఆనుకున్న భూములు ఎకరాకు రూ.కోటి పలుకుతుండగా.. గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఆనుకుని ఉండే భూములు ఎకరాకు రూ.50 లక్షలకుపైగా పలుకుతుంది. దూరంగా ఉండే భూములు రూ.30 లక్షలకు పలుకుతున్నాయి. నర్సాపూర్‌లో ఇంటి స్థలాలైతే హైదరాబాద్‌ను మించి ఉన్నాయి. దీనికి కారణం పట్టణం చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో పాటు ప్రభుత్వ భూమి ఉంది. పట్టా భూములు తక్కువగా ఉండడంతో ఉన్న కొద్దిపాటి భూమికి ఆకాశాన్నంటే ధరలు ఉన్నాయి. పట్టణంలో గజానికి ప్రధాన రోడ్డు సవిూపంలో రూ.20 వేలు, లోపల రూ.10 వేలకు తక్కువ ఎక్కడా లభించడం లేదు. దీంతో సామాన్య, మధ్య తరగతి వారు భూములు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. నర్సాపూర్‌ పట్టణంలో మొన్నటి వరకు వ్యవసాయ భూములుగా ఉన్నవన్నీ నేడు ఇంటి స్థలాలుగా మారి నిర్మాణాలు జరుగుతున్నాయి. కొంతకాలంగా సరైన వర్షాలు లేకపోవడంతో ఉన్న భూమిని అమ్ముకుని కుటుంబాన్ని అయినా పోషించుకుందామని రైతులు అమ్మకానికి సిద్ధమవుతున్నారు. స్థానికేతరులు భూములు కొనుగోలు చేసి వాటికి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు పూలచెట్లు, పండ్ల తోటలు పెంచుతుండగా.. మరికొందరు వాణిజ్య పంటలు వేసుకుంటున్నారు. మాడాపూర్‌, తుల్జారాంపేట, గూడెంగడ్డ, కాగజ్‌మద్దూర్‌, ఆవంచ, నారాయణపూర్‌ గ్రామాల పరిధిలోని ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న
60 శాతానికిపైగా భూములను స్థానికేతరులు, బడాబాబులు, రియల్‌ వ్యాపారులు కొనుగోలు చేశారు. భూములకు మంచి డిమాండ్‌ ఉండడంతో చాలామంది నాయకులు ఈ వ్యాపారంలోనే మునిగి తేలుతున్నారు.