నువ్వొస్తావని..


ఆఫీస్ పని మీద వెళ్తున్నానని
చెప్పి వెళ్ళింది మరీక తిరిగి రాలేదు
జిల్లా కేటాయింపుకని వెళ్ళింది
ఇలా అర్ధాంతరంగా ముగింపు
పలకడానికని అనుకోలేదు..

ఒక్కరోజు కూడా మమ్మల్ని
చూడకుండా, పలకరించకుండా
బడి గడప దాటనిది ఇవ్వాళ
ఏకంగా జిల్లానే దాటిపోయావు..

ఆదరాబాదరాగా హైదరాబాద్ కు
ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్లి
ఎలాంటి కాషన్ కూడా ఇవ్వకుండా
ఫాస్ట్ మోషన్ లో అదృశ్యమయ్యావు..

నువ్వడుగిడగానే మైదానం
నగుమోముతో చిరునవ్వులు రువ్వితే
మొక్కలు, పూలతలు మహదానందంతో
ఊగుతూ మురిసిపోయేవి..

నీ అభినయగేయాలతో పసి
హృదయగాయాలకు సాంత్వన చేకూరితే
నీ మాటల్లోని పాఠాల తీపి
జీవితంలోని చేదును చదును చేసేది..

పొద్దునే సద్దన్నం కూడా తినకుండా
బడికి వస్తే కడుపులో మెలితిప్పినట్టుండేది
కానీ నీ మాటల గలగలల్లో పడి
ఆకలి బడి వాకిలి దాటిపోయేది..

ముభావంగా, ఉదాసీనంగా బడికి
వస్తే నీ మాటల్తో, చేతల్తో మరీ
పడి పడి నవ్వేలా చేసేవాడివి..
ఎవరిని ఎపుడు నీ ప్రేమాభిమానాలతో
ఆత్మీయాలింగనం చేసేవాడివి..

నువ్వొక ఆత్మీయుడివనుకుని
నీకు దగ్గరయ్యాము
సన్నిహితుడవని అభిమానంతో
నీ సన్నిధికి చేరుకున్నాము..

అయినప్పటికీ..
నువ్వు మళ్ళీ తిరిగొస్తావేమోనని
బడి తోటను చిగురింపజేస్తావని
గాయపడ్డ ఈ చిన్ని హృదయాలకు
చేయూతనిస్తావని ఆశిస్తూ..

సర్ఫరాజ్ అన్వర్..
9440981198