చిన్నోడు సురేష్ చారి కి పెద్ద కష్టం... సాయం కోసం ఎదురుచూపులు..!


- సాయం కోసం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం

మునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. దైవదర్శనానికి అని ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడటం  చూసి ఆ పేద తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. ప్రమాదంలో కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించగా... వైద్య ఖర్చుల కోసం డబ్బుల్లేక సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన మారోజు నాగభూషణ చారి ఈశ్వరమ్మ దంపతులు వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేక దాతల నుంచి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... మునగాల మండల కేంద్రానికి చెందిన మారోజు నాగభూషణ చారి ఈశ్వరమ్మ దంపతులకు సురేష్, గణేష్ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సురేష్(21) చారి కొన్ని రోజుల క్రితం భద్రాచలం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా కొనిజర్ల మండలం చెన్నారం గ్రామం వద్ద రోడ్డు వెంట పనిచేస్తున్న జెసిబి అకస్మాత్తుగా రోడ్డు మీదకు వచ్చి సురేష్ చారి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో  ప్రమాదం సంభవించింది. వెంటనే  చికిత్స నిమిత్తం ఖమ్మం సంకల్ప హాస్పిటల్ కి తరలించారు. అక్కడ సుమారు 40 వేలు ఖర్చు అయినా ఆ తర్వాత మెరుగైన వైద్య సాయం కోసం హైదరాబాద్ లోని పోయినీర్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ప్రమాదంలో సురేష్ చారి కి కళ్ళు, ముక్కు, దవడ భాగం పూర్తిగా దెబ్బతినడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించాలని సూచించారు. ఇప్పటి వరకు హైదరాబాదులో 1,50,000 ఖర్చు చేశారు. కానీ సురేష్ చారి తల్లిదండ్రుల పరిస్థితి.... రెక్కాడితే గాని డొక్క నిండని పరిస్థితి.... తల్లి సిమెంట్ ఇటుకల కంపెనీలో రోజు కూలీ... తండ్రి అక్కడా ఇక్కడా చిన్న చిన్న పనులు చేసే వడ్రంగి. తమ్ముడు చిన్నోడు... కూలీల ద్వారా వచ్చిన డబ్బుతో ఏరోజుకారోజు కుటుంబాన్ని వెల్లదీయాల్సిన పరిస్థితి.... ప్రస్తుతం కుమారుడు సురేష్ చారి కి వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. కానీ  అంత భారీ ఖర్చు, ఖరీదైన శస్త్రచికిత్స చేయించటానికి ఈ పేద దంపతుల దగ్గర పైకం లేక సేవా గుణం కలిగిన దాతల నుంచి ఆర్థిక సహాయాన్ని కోరుతున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి సురేష్ చారి బంధుమిత్రులు సామాజిక మాధ్యమాల్లో ఆర్థిక సాయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సురేష్ కి వైద్య ఖర్చుల నిమిత్తం సాయం చేసేవారు సెల్ నెంబర్ 7997168061 కి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఆర్థిక సాయాన్ని అందించాలని వేడుకుంటున్నారు. కానీ ప్రస్తుతం  వైద్య ఖర్చుల నిమిత్తం 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుండడంతో మరి కొంత మంది దాతలు సహకరించాలని ఆ కుటుంబంతో పాటు మునగాల గ్రామస్తులు కోరుకుంటున్నారు.


నా కొడుకుకు ఆర్థిక సాయం చేసి కాపాడండి

-తల్లిదండ్రులు మారోజు నాగభూషణచారి, ఈశ్వరమ్మ

సామాజిక మాధ్యమాల్లో మా బంధుమిత్రులు ఆర్థిక సాయం కోసం సామాజిక మాధ్యమాలను ఆశ్రయించానని.... ఇప్పటివరకు కొంతమంది దాతలు తమకు తోచిన మేర ఆర్థిక సాయాన్ని చేశారని.... వారికి జీవితాంతం రుణపడి ఉంటానని... సాయం చేసి తన కొడుకు బతుకులో వెలుగులు నింపాలని కోరుతున్నారు.