ఓటీఎస్ ప్రక్రియలో పెండింగ్ పనులను పూర్తి చేయండి: జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) కల్పనా కుమారి


విశాఖపట్టణం, ఫిబ్రవరి 14 (జనంసాక్షి బ్యూరో):  ఓటీఎస్ (ఒన్ టైం సెటిల్మెంట్) పథకంలో భాగంగా చేపట్టిన డేటా నమోదు ప్రక్రియలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఓటీఎస్ పథకం అమలు, ఇతర పనుల ప్రగతిపై సమీక్షించేందుకు ఆమె సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో లాగిన్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 3.24 లక్షల లబ్ధిదారులు ఉండగా 2.80 లక్షల మంది వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. మిగతా దరఖాస్తులకు సంబంధించి పరిష్కారాలను త్వరితగతిన చూపాలని, సంబంధిత వివరాలను అప్లోడ్ చేయాలని ఈ సందర్భంగా సూచించారు. అభ్యంతరాలు, డూప్లికేట్ దరఖాస్తులు ఉన్నచో పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో లాగిన్లో తొలగించాలని చెప్పారు.ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. వివరాలు సరిగా లేని దరఖాస్తులను, డేటా సరిపోలని దరఖాస్తులను తిరస్కరించవచ్చని సూచించారు. తహశీల్దార్, ఎంపీడీవో, గృహ నిర్మాణ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఓటీఎస్ ప్ర్రక్రియలో ఆశాజనక ఫలితాలు సాధించాలని జేసీ పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఐటీ మేనేజర్ ప్రకాశ్, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు....